భారత్‌ ప్రతీకారం.. పుల్వామా సూత్రధారి హతం


పుల్వామా: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. కాగా, ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆర్మీ మేజర్‌, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతిచెందారు. సంఘటనాస్థలిని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి.

ఎవరీ రషీద్‌ ఘాజీ

40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది జైషే సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అని భద్రతా దళాలు భావిస్తున్నాయి.  వీరి సందేహంలో నిజం లేకపోలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌ దార్‌కు శిక్షణ ఇచ్చింది ఘాజీనే. రషీద్‌ జైషే మహమ్మద్‌ (జేఈఎం) సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు ప్రధాన అనుచరుడు. ఘాజీ ఐఈడీని ఉపయోగించడంలో దిట్ట. మొన్న అదిల్‌ దార్‌కు ఈ విషయంలో శిక్షణ ఇచ్చింది కూడా అతగాడే. ఇతడిని కశ్మీర్‌కు మసూద్‌ అజరే పంపాడు. 2017,2018 సంవత్సరాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన దాడుల్లో అజర్‌ మేనల్లుళ్లను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఘాజీని అజర్‌ కశ్మీర్‌కు పంపాడు. ఈ దాడులు కూడా పుల్వామాలోనే జరగడం గమనార్హం.

ఎన్నోసార్లు తప్పించుకొని..

ఘాజీ మన జవాన్ల చేతుల్లో ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. గురువారం ఆత్మాహుతి దాడి జరగడానికి కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలోని రత్నిపురాలో జరిగిన ఈ ఘటనలో ఒక పౌరుడు, హెచ్‌వీ బల్‌జీత్‌ అనే జవాను మృతి చెందారు. ఆ రోజు జరిగిన ఎదురు కాల్పుల నుంచి ఘాజీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మాహుతి దాడి పథకం రచించారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. దాడి అనంతరం సమీంలోని ఇళ్లలోనే కొన్ని రోజులుగా దాక్కొని ఉన్నాడు. తాజాగా ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం కూడా సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన లెతోపొరాకు చాలా దగ్గర్లో ఉంది.

ఆ దళమే ఉండుంటే.. ఉగ్రవాదులు మటాషే!

పదకొండేళ్లుగా ఉగ్రవాదంలోనే..

ఘాజీ 2008లో జైషే సంస్థలో చేరాడు. అతగాడికి ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న తాలిబన్లు శిక్షణ ఇచ్చారు. రెండేళ్లు వాళ్ల వద్ద శిక్షణ పొందిన అనంతరం 2010లో పాకిస్థాన్‌కు ఉత్తరాన ఉన్న వజిరిస్థాన్‌లో పాగా వేశాడు. అక్కడే ఉండి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన యువకులను జైషే సంస్థకు నియమించుకునే వాడు. వాళ్లకు ఘాజీ ట్రైనర్‌గా ఉండేవాడు. అలా దక్షిణ కశ్మీర్‌ గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ పట్టు సంపాదించాడు. అదిల్‌‌ దార్‌ కూడా అలా రిక్రూట్‌మెంట్‌ ద్వారా జైషే సంస్థలో చేరిన వాడే.

పుల్వామా.. ఉగ్రవాదుల పుట్ట..!

గ్రామీణ స్థాయిలోనూ నెట్‌ వర్క్‌..

ఘాజీ ద్వారా దక్షిణ కశ్మీర్‌లో జైషే సంస్థ పట్టు సాధించింది. గ్రామీణ స్థాయి నుంచే రిక్రూట్‌మెంట్‌ చేపట్టడం ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా ప్రణాళికలు రచించింది. స్థానిక నియామకాలు చేపట్టేటప్పుడు సదరు యువకులకు, ఆసక్తి చూపేవారికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం, వారిని బెదిరించడం వంటి చర్యలకు ఘాజీ పాల్పడే వాడు. దీన్ని పసిగట్టిన భద్రతా దళాలు ఈ దుశ్చర్యను ఎన్నో సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఎదురు కాల్పులు జరిగాయి. ఆ దాడి నుంచి తప్పించుకుని 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *