గల్లంతైన 51 ఏళ్ల భారత వాయుసేన విమాన శకలాలు లభ్యం

1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్తంగ్‌ పాస్‌ మీదుగా వెళ్తుండగా గల్లంతైంది. 51 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ భారత వాయుసేన విమాన శకలాలు లభ్యమయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్‌ – స్పితి జిల్లాలో గల ఢాకా గ్లేషియర్‌లో ఏఎన్‌-12 బీఎల్‌-534 విమాన శకలాలను అధికారులు గుర్తించారు. చండీగఢ్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో లేహ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్‌ కంట్రోల్‌ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్‌ విమానాన్ని తిరిగి చండీగఢ్‌కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్‌ పాస్‌ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయయి. తర్వాత కొన్ని నెలల పాటు విమానం కోసం రక్షణశాఖ విస్తృత గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ విమానంలో ప్రయాణించిన సిపాయ్‌ బేలీరామ్‌ మృతదేహాన్ని 2003లో హిమాలయన్‌ మౌంటనేరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ సభ్యులు గుర్తించారు. దీంతో మళ్లీ గాలింపు చేపట్టగా మరిన్ని మృతదేహాలను గుర్తించారు. 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. గతేడాది జులైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *