అమెజాన్ అడవులు తగలబడి పోతున్నాయ్…

amazon3ప్రపంచంలోనే అతిపెద్ద వర్షపు అడవులుగా పేరొందిన అమెజాన్‌ అడవులు పెద్ద యెత్తున దగ్ధమవుతుండడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భూగోళంపై అవసరమైన ఆక్సిజన్‌లో 20 శాతం వరకు అమెజాన్‌ అడవులే అంది స్తున్నాయి. అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అడవులు రానురాను అంతరించిపోతుండడంపై పర్యావరణవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచపు ఊపిరితిత్తులు మండిపోతున్నాయని, ఇకనైనా మేల్కొని అమెజాన్‌ అడవులను కాపాడాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. అమెజాన్‌ రక్షణ కోసం ప్రముఖులు విన్నపాలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రే ఫర్‌ అమెజాన్‌ అనే హాష్‌టాగ్‌ వీపరీతంగా సర్య్కూలేట్‌ అవుతోంది. భారత్‌లోనూ వివిధ రంగాల ప్రముఖుల తోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ టాప్‌ హీరోలు సైతం అమెజాన్‌ అడవులను రక్షించాలంటూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.

amazon1అమెజాన్ బేసిన్.. 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు నిలయం. దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులు కూడా ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించటానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే.. అమెజాన్ అడవులు ప్రతి ఏటా కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటాయి.కానీ.. ఈ చెట్లను నరికి, దహనం చేసినపుడు.. అవి నిల్వచేసుకున్న బొగ్గుపులుసు వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. కర్బన ఉద్గారాలను శోషించుకునే సామర్థ్యం కూడా ఈ అడవికి తగ్గిపోతుంది.

amazon2ప్రపంచంలో అతిపెద్ద వర్షాధార అడవులు అమెజాన్ అడవులు. ఇక్కడ జులై నుంచి అక్టోబర్ వరకూ కొనసాగే పొడి కాలంలో అటవీ మంటలు చెలరేగటం సాధారణ విషయమే. పిడుగులు పడటం వంటి సహజ సంఘటనలతో పాటు.. పంటల కోసం, పశువులను మేపటం కోసం అడవులను శుభ్రం చేసే రైతుల వల్ల కూడా ఈ మంటలు చెలరేగుతుంటాయి. అయితే ఈసారి ఈ మంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 85 శాతం అధికంగా మంటలు చెలరేగాయని బ్రెజిల్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ సమాచారం చెప్తోంది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 75,000కు పైగా కార్చిచ్చులు నమోదైనట్లు అధికారిక లెక్క. ఇది 2013 తర్వాత అతిపెద్ద సంఖ్య. 2018లో అమెజాన్ అడవుల్లో 39,759 మంటలు రేగాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో పర్యావరణానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం.. చెట్లను నరికి దగ్ధం చేసేవారిని ప్రోత్సహిస్తోందని ఉద్యమకారులు అంటున్నారు. వాతావరణ మార్పు వాదనను తిరస్కరించే బొల్సొనారో ఈ విమర్శలకు ప్రతిస్పందిస్తూ.. తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటానికి స్వచ్ఛంద సంస్థలు స్వయంగా అడవుల్లో మంటలు రాజేస్తున్నాయని ఆరోపించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *