గొర్రె మాంసం యాడ్‌లో గ‌ణేషుడు.. వీడియో

ఆస్ట్రేలియాలో ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న వివాదానికి కార‌ణ‌మైంది. గొర్రె మాంసాన్ని ప్ర‌మోట్ చేసే యాడ్‌లో గ‌ణేషుడు ఉండ‌టంపై అక్క‌డి హిందువులు తీవ్రంగా మండిప‌డ్డారు. వెంట‌నే ఆ యాడ్‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా (ఎమ్మెల్యే) అనే సంస్థ ఈ నెల 4న ఈ యాడ్‌ను విడుద‌ల చేసింది. దీనిపై ఇప్ప‌టికే హిందూ సంస్థ‌లు ఆస్ట్రేలియన్ స్టాండ‌ర్డ్స్ బ్యూరోకి ఫిర్యాదు చేశాయి. వెంట‌నే ఈ యాడ్‌ను నిషేధించాల‌ని అక్క‌డి హిందూ స‌మాజం అధికార ప్ర‌తినిధి నితిన్ వ‌శిష్ట్ డిమాండ్ చేశాడు. ఈ యాడ్‌లో గ‌ణేషుడే కాదు ఇత‌ర మ‌తాల దేవుళ్ల‌యిన జీస‌స్‌, బుద్ధుడు, థోర్‌, జ్యూస్ ఈ యాడ్‌లో ఉన్నారు. వాళ్లంద‌రినీ ఇందులో నుంచి తొల‌గించాల‌ని హిందూ స‌మాజం స్ప‌ష్టంచేసింది. ఈ దేవుళ్లంతా ఓ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని గొర్రె మాంసం తింటున్న‌ట్లుగా యాడ్‌ను చిత్రీక‌రించారు.

గ‌ణేషుడిని ఈ యాడ్‌లో వాడ‌టం హిందూ స‌మాజం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే అవుతుందని నితిన్ అన్నాడు. ఈ యాడ్‌పై అటు సోష‌ల్ మీడియాలోనూ తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ది. అయితే ఇంత జ‌రుగుతున్నా ఆ సంస్థ మాత్రం ఈ యాడ్‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌త విశ్వాసాల‌ను ఏమీ దెబ్బ‌తీస్తున్న‌ట్లుగా ఈ యాడ్ లేద‌ని, గొర్రె మాంసం అంద‌రినీ ఏకం చేస్తున్న‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే సంస్థ మార్కెటింగ్ మేనేజ‌ర్ ఆండ్రూ హోవీ చెప్పారు. ఆధునిక ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ మ‌త విశ్వాసాలు, వాళ్ల ఆహార నియ‌మాల‌ను చూపెట్టాల‌ని భావించి ఈ ప్ర‌చారానికి తెర తీసిన‌ట్లు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *