రివ్యూ: ‘బాహుబలి: ది కంక్లూజన్’

కథ :
రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్యసాహసాలు నచ్చి తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిలుగా ఉండిపోతారు. అయితే ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకు భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పక ముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైన దేవసేనతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు.

కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నాని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత… దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది.

దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.

ఇది సహించలేని భల్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని ఎలాగైన బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు…? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిసాయా..? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడ్ని ఎలా అంతమొందించాడు.? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ సినిమా తెర మీదకు రావటంలో ప్రధాన పాత్ర హీరో ప్రభాస్‌దే. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం ప్రభాస్ పడిన కష్టం చూపించిన డెడికేషన్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.

ఇక ప్రభాస్‌కు ధీటైన పాత్రలో రానా ఆకట్టుకున్నాడు. తన వయసుకు అనుభవానికి మించిన పాత్రను తలకెత్తుకున్న రానా.. మరోసారి విలక్షణ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్‌తో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. తొలి భాగాంతంలో కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. బాహుబలి ప్రియురాలిగా అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది. తమన్నా పాత్ర క్లైమాక్స్‌కే పరిమతమైంది. రెండో భాగంలోనే కనిపించిన సుబ్బరాజు కుమార వర్మగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండించాడు. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక నిపుణులు :

కీరవాణి మరోసారి తన నేపథ్య సంగీతంతో ‘బాహుబలి’కి పెద్ద బలంగా నిలిచాడు. ఓవైపు ఎమోషనల్ సీన్స్.. మరో వైపు యుద్ధ సన్నివేశాలు.. మరోవైపు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్.. అన్నింట్లోనూ కీరవాణి నేపథ్య సంగీతం పతాక స్థాయిలో సాగుతుంది. బాహుబలిని చంపక తప్పదని శివగామి నిర్ణయానికి వచ్చే సన్నివేశంలో వచ్చే నేపథ్య సంగీతం విన్నాక కీరవాణికి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేం. ఐతే పాటల పరంగా కీరవాణి నుంచి మరింత ఎక్కువగా ఆశిస్తాం. సాహోరే బాహుబలి.. దండాలయ్యా మినహా పాటలు మామూలుగా అనిపిస్తాయి. పాటలు మరింత బాగా ఉండాల్సిందన్న భావన కలుగుతుంది. సెంథిల్ కుమార్ కెమెరా పనితనానికి వంకలు పెట్టలేం. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సన్నివేశాల్లో సెంథిల్ పాత్ర ఏంటన్నది స్పష్టంగా చెప్పలేం కానీ.. వాటితో సంబంధం లేని సన్నివేశాల్లో సెంథిల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని ఔట్ పుట్ ఇచ్చాడు సెంథిల్. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగా సాగింది. రాజ దర్బార్ తో పాటు అనేక సెట్టింగ్స్ కట్టిపడేస్తాయి.

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని ‘బాహుబలి: ది కంక్లూజన్’ అందుకోలేదనే చెప్పాలి. బాగా లేవు అని చెప్పలేం కానీ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత పెట్టుకున్న అంచనాల్ని మాత్రం వీఎఫెక్స్ టీం అందుకోలేకపోయింది. కొంచెం హడావుడిగా పని ముగించేశారేమో అన్న భావన కలుగుతుంది. నిర్మాణ విలువల గురించి.. నిర్మాతల సాహసం గురించి చెప్పేదేముంది? వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథకుడు విజయేంద్ర ప్రసాద్ తొలి భాగంలో కంటే ఇందులో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కథ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగినప్పటికీ.. ప్రధాన పాత్రలు.. వాటి మధ్య సంఘర్షణను విజయేంద్ర డీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అజయ్ కుమార్.. విజయ్ కుమార్ కలిసి రాసిన డైలాగుల్లో నిలకడ లేకపోయింది. కొన్ని చోట్ల మాటలు వారెవా అనిపిస్తాయి. కొన్ని చోట్ల సాదాసీదాగా అనిపిస్తాయి. భాష.. యాస విషయంలో కన్సిస్టెన్సీ లేకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఇప్పటి సినిమాల తరహాలో అనిపిస్తాయి డైలాగులు.

ఇక తొలి భాగంలో కేవలం విజువల్ గ్రాండియర్ తో మాయ చేసేశాడు.. కథను సరిగా చెప్పలేకపోయాడని కొంత మేర విమర్శలెదుర్కొన్న రాజమౌళి.. ఈసారి ఆ విషయం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. అసలు కథను ఆసక్తికరంగా.. బిగువుతో చెప్పడంలో రాజమౌళి విజయవంతం అయ్యాడు. ఎమోషనల్ డ్రామాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎప్పట్లాగే హీరో ఎలివేషన్ సీన్స్ లో రాజమౌళి తనకు తానే సాటి అనిపించాడు. విజువలైజేషన్.. ఎగ్జిక్యూషన్ విషయంలో మరోసారి రాజమౌళి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాకపోతే విజువల్ గ్రాండియర్ విషయంలో ఈసారి రాజమౌళిపై ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాల్ని అతను అందుకోలేకపోయాడు. పతాక సన్నివేశంలో యుద్ధం రాజమౌళి స్థాయికి తగ్గట్లు లేదనే చెప్పాలి. కామెడీ తన కప్ ఆఫ్ టీ కాకపోయినా.. దాని మీద అనవసరంగా దృష్టిపెట్టాడేమో అనిపిస్తుంది. తొలి భాగంతో పోలిస్తే కచ్చితంగా ‘బాహుబలి-2’ కొంత లాగింగ్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో రాజమౌళి కొంచెం జాగ్రత్త పడాల్సింది.

నటీనటులు: ప్రభాస్ – రానా దగ్గుబాటి – అనుష్క – రమ్యకృష్ణ – సత్యరాజ్ – నాజర్ – సుబ్బరాజు – తమన్నా తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
మాటలు: విజయ్ కుమార్ – అజయ్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్
వీఎఫెక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

రేటింగ్: 3/5

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *