బాహుబలి-2 : ప్రేక్షకులకు నచ్చని అంశాలు

బాహుబలి – ది కంక్లూజన్ సినిమా ఓవరాల్ గా బాగుంది. అన్ని ఏరియాస్ నుంచి భారీ వసూళ్లతో పాటు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలోని కొన్ని అంశాలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. అవేంటో చూద్దాం.

భళ్లాలదేవ భార్య ఎవరు..?
పార్ట్-1 నుంచి భళ్లాలదేవను పవర్ ఫుల్ గా చూపిస్తూ వచ్చారు. బాహుబలి-1లో భళ్లాలదేవ కొడుకుని కూడా చూపించారు. పార్ట్-1లోనే అతడు శివుడి చేతిలో మరణిస్తాడు. పార్ట్-2లో కూడా ఆ కనెక్షన్ ఉంటుంది. కాకపోతే.. ఇంత భారీ ఎపిసోడ్ లో భళ్లాలదేవుని భార్య ఎవరనేది ఎక్కడా చూపించరు. నిజానికి కథకు భళ్లాల భార్యకు సంబంధం లేకపోవచ్చు. కానీ కొడుకును చూపించినప్పుడు భార్యను కూడా చూపిస్తే బాగుండేది.

శివగామి చనిపోయిన విధానం
బాహుబలి రెండు భాగాల్లో శివగామిని ధీరోదాత్త మహిళగా చూపించారు. రాజనీతిలో ఆరితేరిన మహారాణిగా ప్రజెంట్ చేశారు. కానీ కనీసం యుద్ధం చేయకుండా పసికందును పట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేయడం చాలామందికి నచ్చలేదు. శివగామి యుద్ధం చేసి, పసికందును రక్షించడం కోసం తను తప్పించుకున్నట్టు చూపిస్తే బాగుండేది. పైగా మాహిష్మతి సామ్రాజ్యంలోనే ఆమె నీటిలో మునిగిపోయినట్టు చూపించారు. కానీ పార్ట్-1లో ఆమె జలపాతం కింద తేలినట్టు చూపించారు. ఈ రెండు సన్నివేశాలకు చిన్నపాటి కనెక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది.

కట్టప్పను చంపమని ఆదేశించే క్రమం
బాహుబలిని చంపాలని శివగామి, కట్టప్పను ఆదేశించే క్రమం చాలామందికి నచ్చలేదు. పార్ట్-1లో కానీ, పార్ట్-2లో కానీ తన సొంత కొడుకు కంటే ఎక్కువగా బాహుబలిని పెంచింది శివగామి. అలాంటి వ్యక్తిపై అతి తక్కువ టైమ్ లో శివగామి అపనమ్మకానికి రావడం చాలామందికి రుచించలేదు.

శివుడు అవంతికను పెళ్లాడకపోవడం
పార్ట్-1లో శివుడు, అవంతిక మధ్య రొమాన్స్ ను అద్భుతంగా చూపించారు. అసలు అవంతిక కోసమే తన ప్రాణాలకు తెగిస్తాడు శివుడు. అంతలా ప్రేమించిన అవంతికను పెళ్లాడినట్టు చివర్లో చూపిస్తే బాగుండేది. అలా చేస్తే అవంతిక పాత్రకు కూడా మంచి ముగింపు ఇచ్చినట్టయ్యేది.

మిస్ అయిన మాయాజాలం
పార్ట్-1తో పోలిస్తే బాహుబలి – ది కంక్లూజన్ లో గ్రాఫిక్స్ మేజిక్ పెద్దగా కనిపించలేదు. బాహుబలి-1లో గ్రాఫిక్స్ మనల్ని గుక్కతిప్పుకోనివ్వవు. కానీ పార్ట్-2లో మాత్రం ఆ చమక్కు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. హంస నావ అనే పాటతో పాటు క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ మాత్రమే ఎక్కువమందికి నచ్చాయి.

నిజానికి ఈ లోటుపాట్లు రాజమౌళికి తెలియనివి కావు. కాకపోతే అప్పటికే నిడివి పెరిగిపోవడంతో కొన్ని పాత్రల్ని, మరికొన్ని సన్నివేశాల్ని కుదించాల్సి వచ్చింది. ఓవరాల్ గా సినిమాను మాత్రం ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *