కేఫ్ కాఫీ డే సిద్ధార్థ కథ విషాదాంతం

కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ కథ చివరకు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీడే యజమాని, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ సొంతూరు కాఫీ సీమ చిక్కమంగళూరు అయితే ముంబైలో వ్యాపార మెళుకువల్ని ఒంటబట్టించుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ రంగంలో మేటిగా నిలిచారు.వీజీ సిద్ధార్థ తనకు ఇష్టమైన కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలతో పాటు పలు దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలో అనూహ్యమైన ఆటుపోట్లు వచ్చాయో ఏమో కనిపించకుండాపోయారు.

బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్‌ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం కావడంతో మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ నివాసంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్‌ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవిక భర్తే సిద్ధార్థ. మరోవైపు సిద్ధార్థ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పూర్తి చేసి ఎస్‌ఎం కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *