చిన్నమ్మకు షాకిచ్చేలా.. రాష్ట్రపతి పాలన?

కొన్నిసార్లు అంతే. కోరుకున్నది చేతికి వచ్చి.. నోటికి వచ్చేంతలో జారి పడిపోతుంది. ఇంకెప్పటికీ అందని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా అన్నాడీఎంకే అధినేత్రి.. చిన్నమ్మగా సుపరిచితురాలు శశికళ తాజా పరిస్థితి ఇదే రీతిలో ఉందని చెప్పాలి. అమ్మ మరణం తర్వాత పార్టీ మీద పట్టును ఒక క్రమపద్ధతిలో తెచ్చుకున్న చిన్నమ్మ.. సీఎం పదవిని చేపట్టేందుకు పావులు కదపటం తెలిసిందే. విధేయుడైన పన్నీరు సెల్వంను ఒప్పించి.. ఆయన చేత సీఎం పదవికి రాజీనామా చేయించిన చిన్నమ్మ.. సీఎం అయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు.

అంతా బాగుందని అనుకుంటున్న వేళ.. డామిట్ కథ అడ్డం తిరిగిందన్న చందంగా చిన్నమ్మపై ఉన్న అక్రమాస్తుల కేసు ఒక్కసారి తెరపైకి వచ్చింది. అక్కడితో మొదలైన ఎదురుదెబ్బలు ఒకటి తర్వాత ఒకటిగా ఆమె స్వప్నాన్ని సాకారం కాకుండా చేస్తున్నాయి. సుప్రీం మాట తర్వాత గవర్నర్ నిర్ణయంలో మార్పు రావటం.. అందుకు తగ్గట్లే కేంద్రం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే సలహాను ఇవ్వటంతో మంగళవారం తనకు మంగళకరంగా ఉంటుందని ఫీలైన చిన్నమ్మకు షాక్ తగిలేలా చేసింది.

కోర్టు తీర్పు వచ్చే వరకూ వెయిట్ చేద్దామని అనుకుంటున్న వేళ.. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టటం ఏమిటంటూ.. విపక్ష నేత స్టాలిన్ ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమిళ ప్రజలు సైతం చిన్నమ్మ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇది సరిపోదన్నట్లు తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత వీరపాండ్యన్ ధిక్కార ధోరణి ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. చిన్నమ్మ సీఎం కలను కల్లలుగా మార్చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

మీడియాతో మాట్లాడిన సందర్భంలో వీరపాండ్యన్ చిన్నమ్మ కలల్ని కల్లలు చేసే కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీరు సరికాదన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. చిన్నమ్మ చేతి వరకూ వచ్చిన సీఎం కుర్చీ చేజారినట్లేనని చెప్పక తప్పదు. అదే జరిగితే.. సీఎం కుర్చీనే కాదు.. పార్టీ మీద పట్టు కూడా సడలుతుందనటంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *