చంద్రయాన్-2 కీలక ఘట్టం…నేటి అర్ధరాత్రి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 లో అత్యంత కీలకమైన ఘట్టం ఈ రోజు అర్ధరాత్రి జరగనుంది. 48 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయాణం ఒక ఎత్తైతే ఇప్పుడు చంద్రుడిపై లండర్ అడుగుపెట్టడం మరో ఎత్తు. ఈ ప్రక్రియ 15 నిముషాల పాటు జరగనుంది కానీ ఇది అత్యంత కీలక దశగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దిగే క్రమంలో శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు సంకేతాలు పంపుతారు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చాక 78 నిమిషాల అనంతరం ల్యాండర్‌ను ఉపరితలంపై దింపడానికి ఆదేశాలు పంపనున్నారు. ఆ సమయంలో ల్యాండర్ వేగం 6,120 కిలోమీటర్లు ఉండగా.. జాబిల్లికి 35×100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. ఇస్రో నుంచి సంకేతాలు అందగానే ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు మండటం ఆరంభిస్తాయి. ఇవి ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. అనంతరం ల్యాండర్‌ కిందకు దిగడం మొదలవుతుంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీనస్‌-సి, సీంపేలియ్‌స-ఎన్‌ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌బీ) ద్వారా అన్వేషించనున్నారు. అక్కడ విక్రమ్‌ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతులంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు ఇస్రోకు చెందిన ఓ సీనియర్‌ శాస్త్రవేత్త వెల్లడించారు. అలా అరగంటలో స్థల అన్వేషణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు.

విక్రమ్ ల్యాందర్ దిగిన తరువాత 4 గంటలకు అంటే ఉదయం 5.30 తర్వాత  ల్యాండర్‌ నుంచి ర్యాంప్‌ విచ్చుకోగా, దాని మీద నుంచి ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ కిందకు దిగుతుంది. అయితే, ఈ రోవర్‌ 14 రోజులపాటు పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌తో కమ్యూనికేషన్‌ సాగిస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *