చిదంబరం వస్తూనే తలంటేశాడుగా

‘క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ క్యాడర్ ను పటిష్టం చేయకుండా పార్టీ కార్యాలయాలలో కూర్చుని పార్టీ ప్రజల గురించి మాట్లాడితే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి మూడేళ్లయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు – కార్యకర్తలు గాంధీభవన్ – ఇందిరాభవన్ లను వదిలిపెట్టి గ్రామాలకు – మండలాలకు వెళ్లి రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలి. మండల స్థాయిలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తే మనం ఇక్కడ ఏం మాట్లాడినా దానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది’ ఇది కేంద్రమాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యలు. తెలంగాణ కాంగ్రెస్ కు చిదంబరం ఇంచార్జీగా వచ్చే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ నేతలు – కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ నేతలకు గట్టిగానే తల అంటారు. తెలంగాణలో టిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని దళితులకు మూడెకరాల భూమి – ఎస్టీ – మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల వాగ్దానాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. వీటిని క్షేత్రస్థాయిలో వివరించాలని కోరారు.

రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం సమంజసమని – రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ కార్యకర్తలు జనంలోకి వెళ్లి పనిచేయాలన్నారు. ‘ఇక మాటలు – ప్రకటనలు చాలు పని చేయడం మన ముందున్న కర్తవ్యం – జనం కేంద్ర రాష్ట్రప్రభుత్వాల చర్యలతో విసిగిపోయి ఉన్నారు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వెళ్లి కేంద్ర – రాష్ట్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలన్నారు. రెండో స్వాతంత్య్ర పోరాటం చేసే స్థాయిలో ప్రజాస్వామ్య పంథాల్లో ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఎమ్మెల్యేలు – ఎంపీలు – ఇంకా పెద్ద నేతలు గ్రామ – వార్డుల కమిటీ నేతల తో కలిసి పనిచేయాలని చిదంబరం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై అధికార పార్టీలోకి ఫిరాయించిన వారిపై రాష్ట్ర శాసనసభ స్పీకర్కు పార్టీ ఫిర్యాదు చేసిందని  ఈ అంశంపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అన్నివర్గాల్లో అశాంతి మొదలైందని నరేంద్రమోదీ వల్ల నిరుపేదలు – మధ్యతరగతి వర్గాలు కుదేలయ్యారన్నారు. జెఎన్ యు – హెచ్ సియూ తదితర వర్శిటీల్లో విద్యార్థుల ఆందోళనలను అణచి వేస్తున్నారన్నారు. దేశంలో ప్రజలను మాటలతో పత్రికా ప్రకటనలతో వంచిస్తున్నారన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వ అపసవ్య విధానాల వల్ల దేశంలో అభివృద్ధి స్తంభించిందని వ్యవసాయ గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమైందన్నారు. ప్రతిరోజూ 11కోట్ల మంది ఖాతాదారులు ఎటిఎంల వద్ద చిన్న మొత్తాల కోసం క్యూలు కట్టారన్నారు. కానీ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించిన లక్షలాది నోట్లు దళారులకు చేరాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదన్నారు. నగదు రహిత లావాదేవీలు ఐరోపా అమెరికాలోనే వంద శాతం లేవన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి సిఎల్ పి నేత జానారెడ్డి సీనియర్ నేతలు భట్టి విక్రమార్క షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *