ఆ ఐపీఎస్ చేసిన ఆదా రూ.850కోట్లు!

ఒక సమర్థుడ్ని కీలక శాఖకు నియమిస్తే  జరిగే లాభం ఎంత? నిజాయితీగా ఉండే అధికారికి ఫుల్ పవర్స్ ఇచ్చేసి.. వ్యవస్థలోని లోపాల్ని అరికట్టమని అడిగి.. అందుకు తగ్గట్లు పని చేసేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తే కలిగే ప్రయోజనం ఎంత ఉంటుంది? అన్న ప్రశ్నలకు తాజాగా సమాధానం లభించింది. అవినీతితో అంటకాగే ఒక శాఖకు కీలక అధికారిని ఒకరిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ఖజానాకు కలిగిన ఆర్థిక లాభాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు.

తాజాగా జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. పౌరసరఫరాల శాఖలో ఉన్నన్ని అక్రమాలు.. అవినీతి మరెక్కడా ఉండవని.. వాటిని కంట్రోల్ చేయటానికి సీవీ ఆనంద్ అనే ఐపీఎస్ అధికారిని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్ర సర్వీసులకు వెళ్లాలనుకున్న ఆయన్ను తాను రాష్ట్రంలో ఉండాలని కోరినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేయాలని ప్రత్యేకంగా అడిగానని.. ఆయన చేసిన పనికి అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లుగా కేసీఆర్ చెప్పారు. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ ఐఏఎస్ అధికారి పోస్ట్ అయిన పౌరసరఫరాల శాఖను కేటాయించామని.. కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ సరికొత్త సంస్కరణలతో ఆనంద్ మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు.

పౌరసరఫరాల శాఖకు ఆనంద్ ను ఎండీగా నియమించిన తర్వాత అక్కడి దుర్మార్గాల్ని కట్టడి చేశారని.. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన అవినీతిని తరిమికొట్టటంలో సక్సెస్ అయ్యారన్నారు.

కేవలం కొద్ది కాలంలోనే ఆనంద్ తీసుకున్న నిర్ణయాలతో పౌరసరఫరాల శాఖలో దుర్మార్గాల్ని అరికట్టి ప్రభుత్వానికి రూ.850కోట్లు ఆదా చేసినట్లు చెప్పారు. పోలీసు అధికారుల్ని నమ్మి పని అప్పగిస్తే ఎంత మంచి జరుగుతుందన్న దానికి తాజా ఉదంతమే నిదర్శనంగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి ఒక ఐపీఎస్ అధికారిని ఇంత ఓపెన్ గా పొగిడేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్నింటికి మించి ఒక నిజాయితీ ఉన్న సమర్థుడైన అధికారినిని కీలక శాఖకు నియమిస్తే.. ఇంత భారీగా ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుందా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి పాయింట్స్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గమనిస్తున్నారా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *