రేపే సీఎం కేసీఆర్ గృహ ప్రవేశం..

మూడు రోజుల ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గురువారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయంలో గృహ ప్రవేశం చేయనున్నారు. గృహ ప్రవేశ మహోత్సవానికి గవర్నర్‌ను ఆయన ఆహ్వానించినట్లు సమాచారం. అంతేగాక తన ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ వివరాలపై గవర్నర్‌తో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు.

కొత్తగా నిర్మించిన ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నూతన గృహ ప్రవేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు.

ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్‌లుగా ఈ నిర్మా ణాలు చేపట్టింది. మార్చి నెలలో ప్రారంభించిన ఈ నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ అధికారులు శరవేగంగా తొమ్మిది నెలల్లోపే పూర్తి చేశారు. దాదాపు వెయ్యి మందితో సమావేశమ య్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ఈ ప్రాంతంలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్న క్వార్టర్లను ఇప్పటికే కూల్చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎం ముఖ్య కార్యదర్శితో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌లకు ఇక్కడే నివాస వసతి కల్పించాలని భావిస్తున్నారు.ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *