అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారు – పవన్‌కల్యాణ్

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన పవన్‌కల్యాణ్ సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఇంత తక్కువ కాలంలో ఇంతటి ఘనత సాధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరి భేటీలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాను సఫలం చేయడంపై మనః స్ఫూర్తిగా అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు పిలిచినప్పుడు సమయం కుదరక రాలేదు. రాష్ట్రం విడిపోతే, తెలంగాణ అంధకారమవుతుందన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 24గంటల విద్యుత్ ఎలా విజయవంతం చేశారో తెలుసుకోవడానికి వచ్చాను. నేను ప్రతి ఒక్కరినీ కలుస్తాను. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అన్ని పార్టీల ప్రతినిధులను కలువటం మామూలే అని తెలిపారు.

24 గంటల పవర్ సైప్లె నాకు నిజంగా ఆనందం వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో జానారెడ్డి
అన్న మాటలు గుర్తొచ్చాయి. 24గంటల విద్యుత్ సరఫరా చేస్తే మీ తరఫున ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. అసాధ్యమనుకొన్న పరిస్థితిని సుసా ధ్యం ఎలా చేయగలిగారు? అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్, పాలసీ గురించి తెలుసుకొందామని వచ్చాను. ఆశ్చ ర్యం కలిగింది..ఆనందం కలిగించింది. అసాధారణమైన విషయాన్ని ఎలా సాధించారన్న దానిపై ఇండియాలో తెలంగాణను కేస్ స్టడీగా పరిశోధన చేయాలి. అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఇతర సంక్షేమ పథకాలతో పోలిస్తే ఎంతమాత్రం సాధ్యం కాదనుకొన్న 24గంటల విద్యుత్‌ను సాధ్యం చేయడంలో విజయవంతం చేయడం తనకు ఆనందాన్నిచ్చిందని పునరుద్ఘాటించారు. సీఎంతో భేటీకి ప్రత్యేక కారణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ర్టాలు విడిపోయాయి. ఇప్పుడు ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్ర స్థితిగతులు  వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ..వాటిని తెలియజేయడానికి సుహృద్భావ వాతావరణం కావాలి. అని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను సామాజిక కార్యక్రమాల్లో కలుస్తుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

జనసేన ఆవిర్భావ సభలో తాను చేసిన మొదటి ప్రసంగంలోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీ టీఆర్‌ఎస్ అనీ, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన నాయకత్వం కేసీఆర్‌ది అని చెప్పానని.. ఆ పార్టీ అంటే తనకు గౌరవం ఉన్నదని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎవరైతే ప్రజలకు ఆశలు కల్పించారో.. ఆ ఆశలను నెరవేర్చుకొంటూ వెళ్తుంటే.. వారికి కాకపోతే.. ఇంకెవరికి శుభాకాంక్షలు చెప్తాం? తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ప్రతిసారీ తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలి, తెలంగాణ నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలి.. హక్కుల సాధన కోసం కేసీఆర్ నడిపిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పదే పదే చెప్తున్నా. ఇక తెలంగాణలో నాకు ఉండే అభిమానులు.. నా పార్టీకి ఉండే బలం అన్నది డిఫరెంట్ ఎజెండా. అని పవన్ మీడియాతో పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *