టీఆర్ఎస్ కి కొడుకుల కంటే అల్లుళ్లంటేనే మోజా?

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా మార్చేస్తామ‌ని సీఎం కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ చెప్పేమాట‌.సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఇన్‌చార్జ్‌గా న‌గ‌రంలో అన్ని వార్డుల్లోను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగి హైద‌రాబాద్ ద‌శ‌దిశ మార్చి వేస్తామ‌ని చెప్పారు. ఫలితంగా గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యం సాధించింది. ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చ‌డం ఏమోగాని, కేటీఆర్ తీరుతో గ్రేట‌ర్ హైద‌రాబాద్ టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగ‌లు జ్వాల‌ల్లా ఎగ‌సి ప‌డుతున్నాయి. దీంతో పార్టీలో కార్పొరేట‌ర్లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు.

పార్టీ సింబ‌ల్‌పై గెలిచిన కార్పొరేట‌ర్లు డ‌మ్మీలేనా ……

పార్టీ ఆవిర్భావంతో పాటు గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతూ వ‌చ్చిన వారు ఇప్పుడు డ‌మ్మీలుగా మారిపోయార‌న్న విమ‌ర్శ‌లు గ్రేట‌ర్ టీఆర్ఎస్ నాయ‌కుల్లోనే వినిపిస్తున్నాయి. గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి పార్టీ సింబ‌ల్ మీద గెలిచిన వారు ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత జంప్ అయిన ఎమ్మెల్యేల చేతుల్లో అణిగిమ‌ణిగి ఉండాల్సి వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఏ ఎమ్మెల్యేలు త‌మ‌ను దారుణంగా ఓడించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశారో ఇప్పుడు కార్పొరేట‌ర్లు వారు చెప్పిన‌ట్టు చేయాల్సి వ‌స్తోంద‌ట‌. ప‌లువురు కార్పొరేట‌ర్లు ఈ చ‌ర్య‌ల‌ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌లేక, ఎమ్మెల్యేల తీరుతో వేగ‌లేక తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

న్యూ సిటీలో అన్ని చోట్లా ఇదే దుస్థితి….

గ్రేట‌ర్‌లోని న్యూ సిటీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కార్పొరేట‌ర్ల‌ను పూర్తిగా అణిచి వేస్తూ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. డివిజన్ల‌లో ఉన్న వార్డుల్లో కార్పొరేట‌ర్లు చెప్పిన వారికే వార్డు మెంబ‌ర్లుగా ఇస్తుంటారు. జీహెచ్ఎంసీలో ఎప్ప‌టి నుంచో ఇదే సంప్ర‌దాయం వ‌స్తోంది. అయితే కొత్త‌గా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కార్పొరేట‌ర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టి వారి అనుచ‌రుల‌నే వార్డు మెంబ‌ర్లుగా నియ‌మించుకుంటున్నారు. దీంతో కార్పొరేట‌ర్లు వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య పోరు తీవ్రమ‌వుతోంది.

గ్రేట‌ర్‌కే గుండెకాయ లాంటి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మ‌ల్యే గ‌త ఎన్నిక‌ల్లో మ‌రో పార్టీలో ఉండి, టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల‌ను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే త‌మ‌పై పెత్త‌నం చెలాయిస్తూ, వార్డుల్లో త‌మ అనుచ‌రుల‌కే వార్డు మెంబ‌ర్ల పోస్టుల ఇప్పించుకోవ‌డం కార్పొరేట‌ర్ల‌లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఒక్కో డివిజ‌న్‌లో 10-12 వార్డులు ఉంటే కార్పొరేట‌ర్ అనుచ‌రుల్లో కేవ‌లం 3-4 గురికి మాత్ర‌మే చోటు ల‌భిస్తుండ‌గా, మిగిలిన వార్డుల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే వార్డు మెంబ‌ర్ పోస్టులు వ‌స్తున్నాయి.

ఇక నిధులు, అభివృద్ధి ప‌నుల విష‌యంలో కూడా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుతో కూడా కార్పొరేట‌ర్లు స‌హించ‌లేక‌పోతున్నారు. పార్టీ జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో చాలా మంది వ‌చ్చే ఎన్నికల్లో ఖ‌చ్చితంగా గెల‌వ‌ర‌ని…అలాంటి ఎమ్మెల్యేల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం ఏంట‌న్న అసంతృప్తి కార్పొరేట‌ర్ల‌లో నెల‌కొంది. గ్రేట‌ర్ వ్య‌వ‌హారాలు చూస్తోన్న మంత్రి కేటీఆర్ సైతం ఈ విష‌యంలో అనుభ‌వ‌రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం పార్టీ శ్రేణుల‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేదు.

పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉంటూ పార్టీకి కొడుకుల్లా ఉంటున్న త‌మ‌కంటే పార్టీ జంప్ చేసి వ‌చ్చిన ఎమ్మెల్యేలను కొత్త అల్లుళ్ల‌లా కేటీఆర్ చూస్తున్నార‌ని టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నం. అదిష్టానం ఇదే రీతిలో తమను పట్టించుకోకుండా ముందుకు వెళితే ముకుమ్మడిగా రాజీనామా చేసేందుకు కూడా కార్పోరేటర్లు సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా కేటీఆర్ ఈ విషయంపై దృష్టి సారిస్తారో ? లేదో ? వేచిచూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *