కేటీఆర్‌ పనికిమాలిన వెధవ

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓ పనికిమాలిన వెధవ అని, కాంగ్రెస్‌ పార్టీపై తన స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తమ్‌ దేశభక్తుడైతే.. కేటీఆర్‌ గుంటనక్క అని, అమెరికా నుంచి గుంటనక్కలా వచ్చి.. నేడు తోడేలులా మారాడన్నారు. ఉత్తమ్‌ కాలిగోటికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్‌ బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్‌పై, ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇసుక మాఫియా పేరిట రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం కాదా? అందులో టీఆర్‌ఎస్‌ నేతలకు వాటాల్లేవా? అని ప్రశ్నించారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని, కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లు కేటీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువులేనని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. గోల్డ్‌ మైన్స్‌ మినరల్‌ కంపెనీలో కేసీఆర్‌ బంధువు సంతోష్‌ కుమార్‌కు వాటాలున్నాయని శ్రవణ్‌ ఆరోపించారు. ఇన్నోవా కొనుగోళ్లతో తనకు సంబంధం లేదంటూ కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని, 2007లో హిమాన్షు మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పెట్టిన కేటీఆర్‌.. ఆ విషయాన్ని 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు.
2015లో ఈ కంపెనీకి సబంధించి ఐటీ రిటర్న్‌లు కూడా దాఖలు చేశారని తెలిపారు. కాగా కాంగ్రెస్‌ను ముసలి నక్క అన్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులూ అనుభవించి ఆయన వెంట ఉన్న కేకే, డీఎస్ లను ఏమనాలో చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *