బంగారం వర్తకులకు కేంద్రం షాక్!

పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్మనీకి భారీగా సహకరిస్తున్న ఆభరణ వర్తకులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జువెల్లర్స్ రూ.500, రూ.1000 పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే తుది గడువుగా నవంబర్ 15ను నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లాక్మనీ వ్యాపారాలను నిర్మూలించేందుకు బంగారం వర్తకులకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దమైనట్టు సమాచారం. బంగారం, జువెల్లరీ మార్గాలలో బ్లాక్మనీని మార్చుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగి కొన్ని ఆభరణ దుకాణాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు పలికినట్టు తెలిసింది.
సాధారణంగా రూ.30వేలు ఉండాల్సిన ఈ ధర రూ.50వేలకు ఎగియడంపై, ఆభరణ వర్తకులపై ప్రభుత్వం సీరియస్ అయింది.బ్లాక్మనీ నిరోధానికి ఆభరణ వర్తకులు సహకరిస్తున్నట్టు తెలుసుకున్న ప్రభుత్వం, కఠిన ఆదేశాలు జారీచేసింది. ప్యాన్ నెంబర్ లేనిది, ఆభరణాలు విక్రయించవద్దని, కొనుగోలుదారుల అన్ని వివరాలను తమకు సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ముంబాయి సిటీలో 250 కేజీల బంగారం అమ్ముడుపోయినట్టు తెలిసింది. పాత నోట్లతో ఈ విలువైన ఆభరణాలను కొనడానికి కొనుగోలుదారులు 20 నుంచి 65 శాతం ఎక్కువకైనా చెల్లించడానికి మొగ్గుచూపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
రద్దుచేసిన నోట్ల తరలింపును గుర్తించడానికి, జువెల్లర్స్, హవాలా ఆపరేటర్లకు చెక్ పెట్టడానికి ఇంటిలిజెన్స్ ఏజెన్సీలందరూ కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాయి. 2017 మార్చి వరకు బంగారం దిగుమతులను కూడా నిషేధించినట్టు మార్కెట్లో రూమర్ వస్తోంది. డిసెంబర్ వరకు కొన్ని ఆంక్షలను ప్రభుత్వం విధిస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *