పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌

ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌. ఉగ్ర‌వాదుల‌కు నీడ‌నిస్తున్న పాకిస్థాన్‌ను ఇక ఏమాత్రం స‌హించ‌బోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ద‌క్షిణ ఆసియాపై అనుస‌రించాల్సిన‌ ర‌క్ష‌ణ వ్యూహాన్ని తాజాగా ప్ర‌క‌టించిన ట్రంప్ ఆ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర‌వాద సంస్థ‌లుకు పాకిస్థాన్ ఆరామంగా మారింద‌ని, దీని ప‌ట్ల తాము మౌనంగా ఉండ‌బోమ‌న్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్ శాంతి కోసం తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు పాకిస్థాన్ అండ‌గా నిలివాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

నేర‌గాళ్లు, ఉగ్ర‌వాదుల‌కు ఊతం ఇవ్వ‌డం వ‌ల్ల పాకిస్థాన్ న‌ష్ట‌పోతుంద‌న్నారు. ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌ని ప‌క్షంలో అణ్వాయుధ దేశ‌మైన పాకిస్థాన్‌కు ర‌క్ష‌ణ స‌హాయం నిలిపేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. ఉగ్ర‌వాదంపై పోరాటం కోసం పాకిస్థాన్‌కు బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఇస్తున్నామ‌ని, కానీ ఆ దేశం మాత్రం ఉగ్ర‌వాదుల‌కు నీడ‌నిస్తున్న‌ద‌ని అన్నారు. ఇలాంటి ధోర‌ణి మారాల‌ని, అది త‌ప్ప‌కుండా మారుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. పాకిస్థాన్‌కు స‌రైన నాగ‌రిక‌త‌ను అల‌వాటు చేసుకునే సంద‌ర్భంగా వ‌చ్చింద‌ని, శాంతి స్థాప‌న‌కు ఆ దేశం స‌హ‌క‌రించాల‌న్నారు. పాకిస్థాన్‌పై ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆ దేశ ఆర్మీ ప్ర‌తినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ కొట్టిపారేశారు. పాకిస్థాన్‌లో ఎటువంటి ఉగ్ర‌సంస్థ క్షేత్రాలు లేవ‌న్నారు. హ‌క్కానీ గ్రూపుతో స‌హా అన్ని ఉగ్ర సంస్థ‌ల‌ను త‌రిమేశార‌న్నారు.

మ‌రో వైపు భార‌త్‌తో బ‌ల‌మైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్న‌ట్లు ట్రంప్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాల్సిన అంశంపైన కూడా ట్రంప్‌ స్పందించారు. అమెరికా ద‌ళాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ఉప‌సంహ‌రిస్తే, అక్క‌డ మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు పేరుకుపోయే అవ‌కాశం ఉంద‌ని ట్రంప్ అన్నారు. ఇరాక్‌లో చేసిన త‌ప్పును ఇక్క‌డ చేయ‌లేమ‌న్నారు. అభివృద్ధి సాధిస్తున్నంత వ‌ర‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌కు స‌హ‌కరిస్తూనే ఉంటామ‌న్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *