తాత మనవడుతో ప్రారంభమై.. తాత మనవడిగానే.. దివికేగిన దర్శకరత్న..

‘పాలకొల్లులో నాకు మాత్రమే తెలిసిన నన్ను ప్రపంచానికి పరిచయం చేసి… పార్లమెంట్‌ వరకు పంపింది చిత్ర పరిశ్రమే. కళామతల్లికి కృతజ్ఞతలు చెబితే తీరేది కాదీ రుణం. నాకు ఎన్ని గౌరవాలు, సత్కారాలు, పదవులు, బిరుదులు వచ్చినా చిత్రసీమ ఇచ్చిన ‘దర్శకరత్న’ను మాత్రమే నా ఉనికికి సంకేతంగా భావిస్తా. సినిమావాడిగా పెరిగిన నేను సినిమావాడిగానే పోతాను. కళామతల్లికి అనునిత్యం నా మనసులో వందనం చేసుకుంటా’’ – ఓ సందర్భంలో దాసరి

దాసరి ఒక సముద్రం. 151 పెను సినీ కెరటాలను అది ప్రభవించింది. దాసరి ఒక శిఖరం. వందల కొద్దీ నటీనట జీవపాయలకు జన్మనిచ్చింది. దాసరి ఒక పెను వృక్షం. వెండితెరను నమ్ముకొని వచ్చిన దారి దొరకని తమ్ముళ్లకు దోవ తెలియని చెల్లెళ్లకు గూడు అయ్యింది. దాసరి ఒక రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గురువు… వేయి విద్వత్తుల బలం దాసరి సొంతం. మహాభారతానికి భీష్ముడు ఒక్కడు. తెలుగు పరిశ్రమకు దాసరి ఒక్కడు.హీరో కింగ్‌…

కాని– డైరెక్టర్‌ కింగ్‌ మేకర్‌ అని నిరూపించినవాడు. హీరో చుక్కాని… కాని డైరెక్టరే కెప్టెన్‌ అని నిర్దేశించినవాడు. దాసరి లేకపోతే తెలుగునాట ఒక డ్రామా పండేది కాదు. దాసరి లేకపోతే తెలుగు తెరపై ఒక డైలాగ్‌ పేలేది కాదు. దాసరి లేకపోతే తెలుగు ప్రేక్షకుడు ఒక మార్పుకు సాక్షి కాగలిగేవాడు కాదు. సినిమా వల్ల తాను ఎదిగి, తన వల్ల సినిమా ఎదిగేలా చేసిన రుషి ఆయన. సినిమాకు తెలుగులో పుట్టిన పర్యాయపదం– దాసరి. మహాగురువుకు వీడ్కోలు.

తొలి అడుగులు…
‘ఒప్పుకోని తప్పు’ : తొలిసారి రంగస్థలంపై నటుడిగా దాసరి మెరిసిన నాటకం. అప్పుడాయనకు తొమ్మిదేళ్లు. ఆరవ తరగతి పుస్తకంలోని చిన్న నాటకం ఆధారంగా వేశారు. పాలకొల్లులోని ఆయన ఇంటి దగ్గర గుడి వద్ద ప్రదర్శించారు.

‘నేనూ నా స్కూల్‌’ : దాసరి రాసిన తొలి నాటకం. నిడివి.. పావుగంట. అప్పుడాయన వయసు పదేళ్లు. స్కూల్‌ వార్షికోత్సవంలో ప్రదర్శించారు. దానికి ప్రైజ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత అదే నాటికను 45 నిమిషాలకు విస్తరించి మళ్లీ స్కూల్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఆల్‌ ఇండియా టీచర్స్‌ కాన్‌ఫెడరేషన్‌కు సెలక్ట్‌ కావడంతో రవీంద్ర భారతిలో మళ్లీ ప్రదర్శించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ చేతుల మీదుగా ఉత్తమ రచన, ఉత్తమ నటుడు అవార్డ్స్‌ అందుకున్నారు.

నటుడిగా దాసరి తొలి సినిమా ‘అందం కోసం పందెం’లో చెప్పిన తొలి డైలాగ్‌ – ‘దిగ్ధంతులైన కవిపండిత ప్రఖాండులకే ప్రవేశం దొరకని కవితా సమ్మేళనానికి రాదలచితివా? కవి బ్రహ్మ అని ఖ్యాతిగాంచిన మా కిలకిల శ్రీవారు మీలాంటి అర్బకులతో ప్రసంగించరు పొమ్ము’.
జగత్‌ జెట్టీలు: మాటల రచయితగా తెరపై తొలిసారి దాసరి పేరు పడిన సినిమా. ‘తాతామనవడు’ దర్శకుడిగా దాసరి తొలి సినిమా… ‘శివరంజని’ నిర్మాతగా తొలి సినిమా..

దాసరిలా మరొక దర్శకుడు ఉండడు. దాసరిలా మరొక రచయిత ఉండడు. దాసరిలా పెద్ద దిక్కు మరొకరు ఉండడు. మొత్తంగా దాసరిలా మరో మనిషీ ఉండడు. అవును.. దాసరికి సరిలేరెవ్వరు. 1942 మే 4న పాలకొల్లులో దాసరి నారాయణరావు జన్మించారు. ఆరుగురి సంతానంలో దాసరి మూడో కొడుకు. దాసరి తండ్రిది పొగాకు వ్యాపారం. దాంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కాదు. కాని హఠాత్తుగా పొగాకు గోడౌన్‌ తగలబడి పోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. దాసరి చదువుకి అదే ఆటంకం అయింది. ఐదో తరగతి వరకూ ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకున్న దాసరికి ఆరో తరగతి తర్వాత చదవడం గగనమైపోయింది. పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సింది బదులు వడ్రంగి పనికి వెళ్లాల్సి వచ్చింది.

ఆ  కల నెరవేరకుండానే…
‘‘మహాభారతం నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అందులో భారత యుద్ధాన్ని తెరపై చూపించాలన్నది నా కల. మహాభారతాన్ని చాలామంది తీశారు కానీ, యుద్ధం జరిగిన రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయాలను ఎవరూ చూపించలేదు. 18 రోజులు జరిగిన యుద్ధంలో గొప్ప మంత్రాంగాలు జరిగాయి. గొప్ప గొప్ప కథలున్నాయి. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాలుగు భాగాలుగా ఆ సినిమా తీయాలనుకుంటున్నా. ఒక్కో భాగానికయ్యే బడ్జెట్‌ వంద కోట్లు.

ఈ చిత్రాన్ని ఓ విదేశీ కంపెనీతో కలిసి నిర్మించబోతున్నాం. కొంతమంది రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ తయారు చేయిస్తున్నా. రెండు భాగాలకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు భాగాలు పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. ఈ నాలుగు భాగాలకూ నేనే దర్శకత్వం వహిస్తా.  నాతో పాటు నలుగురు దర్శకులు కూడా ఈ ప్రాజెక్ట్‌కి వర్క్‌ చేస్తారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాను కాబట్టి, అన్ని భాషలవాళ్లనీ తీసుకోవాలనుకుంటున్నా. దర్శకునిగా నా చివరి చిత్రం ఇదే అవుతుంది. ఘంటశాలగారికి ’భగవద్గీత’ ఎలా మిగిలిపోయిందో, నా జీవితానికి ఈ భారత యుద్ధం మిగిలిపోవాలన్నది నా లక్ష్యం’’. – ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాసరి

మూడుంపావలా లేక…
అప్పట్లో దాసరి బడికి కట్టాల్సిన ఫీజు మూడుంపావలా. 1950లలో అది చాలా ఎక్కువ. అది కట్టలేకే దాసరిని బడి మాన్పించారు. దాసరి చురుకైన కుర్రాడు. చదువులో బెస్ట్‌. ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా బహుమతి కూడా వచ్చింది. ఇక చదువుకి దూరమైపోతున్నానని తెలిసిన ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. కానీ, తండ్రి మాట జవదాటడానికి కుదరదు. విచిత్రం ఏంటంటే… పదేళ్ల కుర్రాడు ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగాడు. అందుకే తండ్రి చెప్పినట్లు పనిలో చేరాడు.

విధి ఆ విధంగా చిన్న చూపు చూసినా స్కూల్‌ మాస్టారి రూపంలో మరో విధంగా పెద్ద చూపే చూసింది. ఒకరోజు ఆ మాస్టారి సైకిల్‌ చైన్‌ ఊడిపోతే, పరిగెత్తుకుంటూ వెళ్లి, దాసరి సరిచేశాడు. ‘ఇక్కడున్నావేంటి’? అని ఆ మాస్టారు అడిగితే, చదువు మానేసిన విషయం దాసరి చెప్పాడు. ఇంత తెలివైన కుర్రాడు చదువుకి దూరం కావడం ఇష్టం లేక ఆ మాస్టారు ముందుకొచ్చి, స్కూల్‌ విద్యార్థులందరినీ సాయం చేయమని అడిగితే, అందరూ కలిసి ఫీజు కట్టేశారు. దాసరి ఉత్సాహంగా బడికి వెళ్లాడు. నంబర్‌ వన్‌ స్టూడెంట్‌. ముందు క్లాస్‌ లీడర్, ఆ తర్వాత స్కూల్‌ లీడర్‌ అయ్యారు.

చదువు కోసం అరటి పండ్లు అమ్మారు
పిల్లలందరూ ఒకవైపు.. దాసరి ఒకవైపు. బుద్ధిగా చదువుకుంటున్న దాసరి మనసు నాటకాల వైపు మళ్లింది. వేరేవాళ్లు వేస్తున్న నాటకాలు చూసి, ‘మనం ఎందుకు రాయకూడదు’ అనుకుని, నాటకాలు రాయడం మొదలుపెట్టాడు. అప్పుడు దాసరి వయసు పదేళ్లు. నాటకాలు రాయడం, నటించడం, ప్రైజులు అందుకోవడం.

కాలేజీకి వచ్చేసరికి నాటకాల మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది. కానీ, చదువుని మాత్రం అశ్రద్ధ చేయలేదు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పుస్తకాలు కొనుక్కోవడం కోసం కావిడి వేసుకుని అరటి పండ్లు అమ్మాడు. టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌. షార్ట్‌ హ్యాండ్‌ నేర్చుకున్నారు. బీకామ్‌ పట్టా పుచ్చుకున్నాక పాలకొల్లు టు హైదరాబాద్‌ దాసరి ఎర్రబస్సు ఎక్కారు.

హైదరాబాద్‌ టు మదరాస్‌
భాగ్యనగరానికి వచ్చిన తర్వాత కూడా నాటకాలు రాయడం, వేయడం. రవీంద్ర భారతి, గాంధీ భవన్‌లలో దాసరి నాటకాలంటే జనాలు ఎగబడి టిక్కెట్లు కొనుక్కునేవాళ్లు. నాటకాల మీద ఉన్న ఆ మమకారమే సినిమాల్లోకి తీసుకొచ్చింది. అప్పటికి సినిమా పరిశ్రమ అంతా మదరాసు (చెన్నై)లోనే ఉంది. సినిమాల్లో చేయాలంటే అక్కడికి వెళ్లక తప్పదు. చెన్నైలో అడుగుపెట్టిన మొదటి రోజునే దాసరి నటుడిగా మేకప్‌ వేసుకున్నారు.

వాహిని స్టూడియోలో ‘అందం కోసం పందెం’ అనే సినిమాలో కమెడియన్‌ వేషం దక్కింది. అప్పటికే సీనియర్‌ కమెడియన్‌గా దూసుకెళుతున్న హాస్యనటుడు బాలకృష్ణ (అంజి) చెప్పాల్సిన డైలాగ్‌ను దాసరితో చెప్పించారు. సీనియర్‌కి కోపం రావడానికి ఆ మాత్రం చాలు కదా. దాసరిని షూటింగులో ముప్పతిప్పలు పెట్టారు బాలకృష్ణ. మదరాసు నుంచి వెనక్కి వెళ్లిపోతే? దాసరి మనసులో ఈ ఆలోచన ఒక్క క్షణం మాత్రమే. చిన్న చిన్న దెబ్బలనే తట్టుకోలేకపోతే ఎలా? తనకు తాను ధైర్యం చెప్పుకున్నారు.

మాటల రచయితగా…
దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటించడం వచ్చు. రాయడం వచ్చు. రచయిత పాలగుమ్మి పద్మరాజు దగ్గర సహాయకుడిగా చేరారు. దాసరి అన్నయ్య చదివిన కాలేజీలో పద్మరాజు లెక్చరర్‌. ఆ పరిచయంతో దాసరి ఆయన్ను కలిశారు. ‘ప్రేమకు పర్మిట్‌’ అనే కన్నడ సినిమా తెలుగు అనువాదం  ‘పర్వతాలు–పానకాలు’కి మాటలు రాశారు దాసరి. రైటర్‌గా తొలి సినిమా అది. ఆ తర్వాత ‘జగత్‌ కిలాడీలు’, ‘జగత్‌ జట్టీలు’ చిత్రాలకు రైటర్‌గా పని చేశారు. ‘కూతురు–కోడలు’ తదితర చిత్రాలకు మాటలు రాశారు. పలు చిత్రాలకు కథలు రాశారు.

అనుకోకుండా దర్శకుడిగా…
నిజాయతీగా పని చేయడం, రాసిన డైలాగ్‌ని నమ్మడం, సూర్యకాంతం లాంటి సీనియర్‌ ఆర్టిస్ట్‌ ఆ డైలాగ్‌ని మార్చమంటే, ససేమిరా అనడం… ఇవన్నీ దాసరి ఆత్మాభిమానాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నలుగురికీ తెలియజేశాయి. సినిమా పరిశ్రమలో మెల్లిగా అందరికీ దగ్గర కాగలిగారు. నాటక రంగంలో ఉన్నప్పుడు నాగభూషణంతో ఏర్పడిన పరిచయం దాసరికి హెల్ప్‌ అయింది. దర్శకుడు భీమ్‌సింగ్‌కు దాసరిని పరిచయం చేశారు నాగభూషణం. అప్పటికి ఆయన ఎన్టీఆర్‌తో ‘ఒకే కుటుంబం’ అనే సినిమా తీస్తున్నారు. దానికి దాసరిని కో–డైరెక్టర్‌గా తీసుకున్నారు. మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యాక భీమ్‌సింగ్‌కు హిందీలో దిలీప్‌కుమార్‌తో తీస్తున్న ‘గోపి’ చిత్రంతో డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. దాంతో కో–డైరెక్టర్‌ హోదాలోనే ఉండి, దాసరి ఆ సినిమా  సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసేశారు.

‘తాత–మనవడు’తో ఫుల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా…
నాగభూషణంతో ఉన్న పరిచయంతో ఆయన్ను ముఖ్య పాత్రలో పెట్టుకుని, దాసరి ఓ కథ రెడీ చేశారు. అదే ‘తాత–మనవడు’. నిర్మాత రాఘవ. అప్పటికి నాగభూషణం సూపర్‌ స్టార్‌ కావడంతో భారీ పారితోషికం అడిగారు. ‘ఇప్పుడు కొంచెం.. రిలీజై 50 రోజులాడిన వెంటనే మిగతా పారితోషికం ఇస్తా’ అని రాఘవ చెప్పిన మాటలను నాగభూషణంకు చేరవేశారు దాసరి. ‘ఏమో.. 50 రోజులాడుతుందా?’ అని నాగభూషణం అనడం, దాసరి బాధపడటం జరిగాయి. చివరకు ఎస్వీఆర్, రాజబాబు, సత్యనారాయణలతో ఆ సినిమా తీశారు. 350 రోజులాడిందా సినిమా. ఆ తర్వాత చేసిన ‘సంసారం సాగరం’, ‘బంట్రోతు భార్య’, ‘స్వర్గం–నరకం’… ఇలా హిట్ల మీద హిట్లు.

మహిళా పక్షపాతి
ఏయన్నార్‌తో  ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’, ఎన్టీఆర్‌తో ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు… ఇలా నాటి తరం హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో కూడా సినిమాలు తెరకెక్కించారు. దాసరి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు చూస్తే ఆయన మహిళా పక్షపాతి అనిపిస్తుంది.

ఉదాహరణకు, ‘శివరంజని’, ‘కంటే కూతుర్నే కను’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘అమ్మ రాజీనామా’ వంటివి. ఒక్కడిగా పరిశ్రమకు వచ్చిన దాసరి ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు చేశారు. మోహన్‌బాబు, మురళీమోహన్, ఆర్‌. నారాయణమూర్తి, జయసుధ, జయప్రద, సుజాత, ప్రభ వంటి ఎంతోమంది తారలను పరిచయం చేసిన ఘనత ఆయనది. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ దాసరి శిష్యుడే. రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, రాజా వన్నెంరెడ్డి వంటి దర్శకులందరూ ఈ గురువుకి శిష్యులే.

నటుడిగానూ…
ఓ వ్యక్తికి 24 శాఖల మీద పట్టు ఉండటం పెద్ద విషయం. దాసరికి అన్ని శాఖల మీద పట్టు ఉంది. కెమెరా వెనక కథారచయితగా, మాటల రచయితగా, పాటల రచయితగా, దర్శకుడిగా… ఇలా వివిధ శాఖల్లో తన బలాన్ని నిరూపించుకున్న దాసరి తెరపై నటుడిగా కూడా ‘భేష్‌’ అనిపించుకున్నారు. ‘స్వర్గం– నరకం’లో ఆయన చేసిన ‘ఆచారి’ పాత్ర పెద్ద హిట్‌. ‘శివరంజని’, ‘ఎం.ఎల్‌.ఏ. ఏడుకొండలు’, ‘అద్దాల మేడ’,  ‘అమ్మ రాజీనామా’, ‘మామగారు’,  ‘ఒసేయ్‌ రాములమ్మ’ వంటి అనేక చిత్రాల్లో దాసరి నటన అద్భుతం.

ఎక్కువ సినిమాలకు దర్శకత్వం రికార్డ్‌ దాసరిదే
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా ‘లిమ్కా వరల్డ్‌ రికార్డ్‌’ దాసరి సొంతమైంది. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘ఎర్రబస్సు’. ఇది దాసరికి 151వ సినిమా. హిందీ చిత్రాలు ‘ఆశాజ్యోతి’, ‘ఆజ్‌ కా ఎమ్మెల్యే’, ‘రామ్‌ అవతార్‌’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కన్నడంలో ‘స్వప్న’, ‘పోలీస్‌ పాపన్న’, సినిమాలు తీశారు. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నట్చత్రం’. పాటల రచయితగా ‘మనుషులంతా ఒక్కటే’ కోసం ‘నిన్నే పెళ్లాడతా..’, ‘బుజ్జిబాబు’ సినిమా కోసం రాసిన ‘సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి..’.. ఇంకా పలు చిత్రాలకు రాసినవి ఆకట్టుకున్నాయి. 250 చిత్రాలకు మాటలు రాశారు. అంతే కాదు.. ‘శివరంజని’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, దాదాపు 53 చిత్రాలు నిర్మించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *