హైదరాబాద్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం: పవర్ కట్, జలయమం, ట్రాఫిక్ కష్టాలు

నగరంలో మంగళవారం రాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ఖైరాతాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాగోలు, పంజాగుట్ట, మియాపూర్‌, మొయినాబాద్‌, కాప్రా, అల్వాల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచాయి. దీంతో ప్రధాన రహదారులపై వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో అర్ధరాత్రి వేళ పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకొంది.

ఉరుములు, మెరుపులకు గాలి దుమారం తోడవడంతో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఈదురు గాలుల ధాటికి కొన్నిచోట్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. భారీ వర్షం కారణంగా అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బీకేగూడ, సనత్‌నగర్‌లలో చెట్లు నేలకొరిగాయి. ఎర్రమంజిల్‌, తాజ్‌కృష్ణ మార్గంలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజేంద్రనగర్‌, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎండవేడిమితో అల్లాడిపోతున్న నగరవాసులకు.. కొంత ఉపశమనం కలిగించిన ఈ భారీ వర్షం.. ఇబ్బందులకు కూడా గురిచేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *