కుండపోత వర్షం…ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన కుంభవృష్టి వర్షానికి మహా నగరం వణికిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయింది. ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 101 ఏళ్ల తరువాత కుండపోత వర్షం పడటంతో రహదారులు జలంతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి.
1918 డిసెంబర్ తర్వాత హైదరాబాద్లో మళ్లీ ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. నిన్న రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్లో 12 సెం.మీల వర్షం కురిసింది. అలాగే అల్వాల్, కాప్రా, కూకట్పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, మెహిదీపట్నం, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముసాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.