‘సంక్రాంతి’ కోడిపందాలకు బ్రేక్: నిషేధం విధించిన హైకోర్టు

హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే కోడి పందేలకు బ్రేక్ పడింది. కోడి పందేలపై నిషేధం విధిస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పందేల పేరుతో కోళ్లను హింసిస్తున్నారని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, కోడి పందేలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

కాగా, సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేల ద్వారా రూ. కోట్లు చేతులు మారుతుంటాయి. కోళ్ల కాళ్లకు కత్తులు, పదునైనా ఆయుధాలు కట్టి పోటీలు నిర్వహిస్తుంటారు. దీంతో ప్రతియేటా ఈ పోటీలో తీవ్ర గాయాలపాలై వేలాది కోళ్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కోర్టు కోడిపందేలపై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, సంక్రాంతి అంటే కోడి పందేలు కూడా అని పోటీ నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే కోడి పందేల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలను తీర్చేందుకు స్వైపింగ్ మిషిన్లను కూడా పోటీల్లో ఉపయోగించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.

గతంలో కూడా కోడి పందేలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా.. సుప్రీంకోర్టును ఆశ్రయించి కోడి పందేలకు అనుమతి తెచ్చుకోవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో కోడిపందేల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *