తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని న్యాయస్థానం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మధ‍్యంతర ఉత‍్తర్వులు జారీ చేసింది.

మల్లన్నసాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూములను 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా భూ సేకరణ చేస్తుండటాన్ని సవాలు చేస్తూ మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఆ భూములపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వేర్వేరుగా పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి, గత ఏడాది నవంబర్‌ 24న మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జీవో 123 పేరుతో అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటూ, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రైతులు హైకోర్టుకు నివేదించారు. చట్టాన్ని కాదని, కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. చట్టం ముందు జీవో ఎందుకు పనికి రాదని వివరించారు.

అయితే ఈ వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. బలవంతంగా భూములు తీసుకోవడం లేదని తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించిన తరువాతనే భూములు తీసుకుంటున్నామని కోర్టుకు నివేదించింది. ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి భూములను కొనుగోలు చేసే అధికారం రాజ్యాంగం తమకు కల్పించిందని వివరించింది.

స్వచ్ఛందంగా సేకరించిన భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, అందుకు సంబంధించి జీవోలు 190, 191లు జారీ చేసిందని తెలిపింది. అయితే జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని హైకోర్టు గురువారం మధ‍్యంతర ఉత‍్తర్వులు జారీచేసింది.

కాగా  2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సంక్లిష్టంగా ఉందని, ఎక్కువ జాప్యం అవుతుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలైలో 123 జీవో తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రైతుల సమ్మతితో భూమిని కొనుగోలు చేసింది. ఇటీవల మల్లన్నసాగర్ పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ సందర్భంగా ఇదే వివాదం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *