హైదరాబాద్‌లో మేయర్ సాబ్ కూడా రాంగ్ రూట్లోనే…

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నగరంలో రోడ్లపై గుంతలు ఎక్కడుంటాయో.. యూటర్న్‌లు ఎక్కడుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి హైదరాబాద్ ప్రథమ పౌరుడు కూడా రాంగ్‌రూట్లోనే వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. నగర మేయర్‌తోపాటు ఉప్పల్‌, జనగామ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఘటన హబ్సిగూడలో మంగళవారం జరిగింది.  సుప్రభాత్‌ హోటల్‌లో బయోడైజెస్ట్‌ యంత్రాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హబ్సిగూడ వీధి నెం.4లో ఎలక్ర్టానిక్‌ టాయ్‌లెట్‌ను ప్రారంభించేందుకు ఐఐసిటి నుంచి యూ టర్న్‌ తీసుకుని వెళ్లాల్సి ఉండగా మేయర్‌ వాహనం హబ్సిగూడ వీధి నెం.1 వైపు రాంగ్‌ రూట్‌లో వెళ్లింది. ఆయన వాహనాన్ని అనుసరించి మిగతా వాహనాలన్నీ అటువైపే బారులు తీరాయి. గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను నిలిపివేయగా మేయర్‌ సహా అందరూ వాహనాలు దిగి కాలినడకన వీధి నెం.4 వైపు వెళ్లారు.
ఈ ఘటనపై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ సాబే రాంగ్‌రూట్లో వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇక హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. ప్రధాన రహదారుల్లో యూటర్న్స్ ఏర్పాట్లపై నగరవాసులు మండిపడుతున్నారు. మెట్రో పేరుతో యూటర్న్స్‌ను ఎక్కడికెక్కడికో మళ్లిస్తున్నారని, రెండుమూడు కిలోమీటర్లు వెతుక్కుంటూ వెళ్లినా యూటర్న్‌లు దొరకడం లేదని వాపోతున్నారు. రెండు వందల మీటర్ల దగ్గర్లోని ప్రదేశానికి వెళ్లాలన్నా.. రెండు మూడు కిలోమీటర్లు యూటర్న్ కోసం వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. అందువల్లే మేయర్ కూడా రాంగ్‌రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైనా దృష్టి సారించి వాహనదారులకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో యూటర్న్‌లు ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *