వచ్చే ఎన్నికల్లో నేనే ‘కింగ్’: గద్దర్ కీలక వ్యాఖ్య..

ప్రజా యుద్దనౌక గద్దర్ 2019ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ‘కింగ్’ తానేనని వ్యాఖ్యానించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నుంచి బయటకొచ్చానే తప్ప, జెండాను కిందవేయకుండా ఓట్ల విప్లవం వైపు పయనిస్తున్నానని చెప్పారు.

ప్రస్తుతం సాధించుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమేనని, త్యాగాల తెలంగాణ ఎంతమాత్రం కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు రాజకీయ చైతన్యంతో ఓట్లు వేయాలని సూచించారు.లక్ష్యం నెరవేరే వరకు తన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆపకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమన్నారు.

కాగా, ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల గురించిన చర్చ మొదలైపోయింది. అధికార పక్షాలు తమ పట్టు నిలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అదే సమయంలో జనసేన లాంటి కొత్త పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో తెరంగ్రేటం చేయబోతున్నాయి. ఏపీలో అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనగా.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాస్వామిక శక్తుల నుంచి ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉంది. కోదండరాం వంటి మేధావులు, గద్దర్ వంటి ప్రజా గాయకులు ఒక్క తాటి పైకి వస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని ప్రస్థానానికి బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *