75 గజాల్లోపు ఇంటి స్థలం ఉంటే పన్నుఅవసరంలేదని,

వేములవాడ:వేములవాడ పట్టణ ప్రగతి సమ్మేళనం కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందాలని, పట్టణాల్లో అవినీతి లేకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పట్టణ ప్రణాళిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవినీతి రహితంగా పాలన ఉండేందుకే ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. పురపాలక చట్టం ప్రకారం 100 శాతం ఇంటి పన్నులు కట్టించాల్సిన బాధ్యత కౌన్సిలర్లపై ఉందన్నారు. పట్టణంలో 75 గజాల్లోపు ఇంటి స్థలం ఉంటే మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 95 శాతం పట్టణ ప్రణాళిక విభాగానికి పనులు లేకుండా పోతుందన్నారు. మున్సిపల్ కొత్త చట్టంలో పౌరులకే అధికారం ఇచ్చామన్నారు. తప్పుచేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. తప్పుడు నిర్మాణాలు చేపడితే జిల్లా కలెక్టర్‌కు నేరుగా కూల్చే అధికారాలు ఉన్నాయన్నారు. పట్టణంలో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్లు నిర్మించాలన్నారు. వెయ్యిమందికి ఒక ప్రజా మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. కొత్త గ్రామపంచాయతీలు, మండలాలు, రెవిన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నది స్థానికులకు పూర్తి స్థాయిలో ఫలాలు అందేందుకు, వేగంగా పరిపాలన సౌలభ్యంకోసమేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *