వాణిజ్యఅంశాల్లో భారత్ మమ్మల్ని బాగా చూడదు…డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ, భారత్‌లో తొలిసారి పర్యటనకు వచ్చే నాలుగు రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పరిశీలకులు అంచనా వేస్తున్నట్లు తన పర్యటనలో అధ్యక్ష ఎన్నికల లోపు ఒప్పందం కుదురుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు మరిన్ని లాభాలు చేకూర్చేలా ఒప్పందం ఉండడం కోసం, వాణిజ్య అంశాల్లో భారత్ తమతో సరిగ్గా వ్యవహరించట్లేదని ఆయన చెప్పారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవచ్చని ఆయన సంకేతమిచ్చారు. ‘‘భారత్ మమ్మల్ని బాగా చూడదు. కానీ ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాషింగ్టన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌ను సందర్శిస్తారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌కు అవమానమని కాంగ్రెస్ విమర్శించింది. భారత్-అమెరికా సంబంధాల్లో ఎన్నో ఏళ్లుగా సాధించిన పురోగతిని తీసిపారేయడమే అవుతుందని ఆ పార్టీ ప్రతినిధి మనీశ్ తివారీ ఢిల్లీలో విమర్శించారు. 70 లక్షల మంది ప్రజలు స్వాగతం పలకడానికి ట్రంప్ ఏమైనా దేవుడా అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా నావల్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసే ఈ చాపర్ల కోసం భారత్ 260 కోట్ల డాలర్లు వెచ్చించనుందని సమాచారం.