అండర్-19 ప్రపంచకప్: పాక్ చిత్తు.. ఫైనల్లో భారత్

అండర్-19 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్‌కు చేరుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా మంగళవారం జరిగిన సెమీస్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పృథ్వీ సేన దాయాదీ జట్టును 203 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తద్వారా ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్‌లో ఆసీస్‌తో తలపడనుంది.
   ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో పాటు బ్యాట్స్‌మన్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీషా(41), మంజోత్(47) జట్టుకు శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 89 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటడంతో పాటు, వికెట్ కీపర్ దేశాయ్(20), రియాన్ పరాగ్(2), అభిషేక్ శర్మ(5) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది.
   ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్-అనుకుల్ రాయ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి జట్టు స్కోరును200 దాటించారు. అయితే రాయ్ 33 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్ సెంచరీ చేరువైన సమయంలో టెయిలెండర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో ఆఖర్లో తీవ్ర ఉత్కఠ నెలకొంది. చివరి బంతికి ఒక పరుగు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా పాక్ బౌలర్ నోబాల్ వేశాడు. ఆ బంతికి రెండు పరుగులు చేసిన గిల్ సెంచరీ పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ మూసా నాలుగు, అర్షద్ ఇక్భాల్ మూడు, అఫ్రిదీ ఒక వికెట్ పడగొట్టారు.
   కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ భారత బౌలర్ల ధాటికి 29.3 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే భారత బౌలర్లు ఏ రీతిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. వారి ఇన్నింగ్స్‌లో నజీర్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ నాలుగు, శివ సింగ్, రియాన్ పరాగ్ రెండు, అనుకుల్ రాయ్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *