భారత్‌పై చైనా మీడియా వెకిలి కూతలు!

చైనా మీడియా మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నదని విమర్శించింది. భారత్‌ సైనిక ఘర్షణకు దిగితే.. 1962 కన్నా ఎక్కువగా దెబ్బతింటుందని హెచ్చరించింది. ‘డోంగ్లాంగ్‌ ప్రాంతంలో ఆధిపత్యం కోసం తన సైన్యం ఉపయోగపడుతుందని భారత్‌ భావిస్తే.. రెండున్నర పక్షాలతో ముఖాముఖి యుద్ధానికి ఆ దేశం సిద్ధపడితే.. భారత్‌కు చైనా సైనిక శక్తి ఏమిటో చూపాలి. జైట్లీ చెప్పిన మాట నిజమే.  1962 నాటి భారత్‌.. 2017నాటి భారత్‌ ఒకటి కాదు. 1962 కన్నా ఎక్కువగా భారత్‌ ఇప్పుడు నష్టపోతుంది’ అని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తన సంపాదకీయంలో పేర్కొంది.

చైనా, పాకిస్థాన్‌తోపాటు అంతర్గత శక్తులతో ముఖాముఖీ పోరాటానికి సిద్ధమేనన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, రక్షణమంత్రి జైట్లీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పరుషమైన పదజాలంతో ఈ సంపాదకీయాన్ని వండివార్చింది. డోంగ్లాంగ్‌ ప్రాంతాన్ని వివాదాస్పదంగా మార్చి.. అక్కడ తమ దేశం చేపట్టే రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడమే భారత్‌ ఉద్దేశమని, ప్రచ్ఛన యుద్ధ పిపాసి అయిన భారత్‌ చైనా రోడ్డు చేపడుతున్న నిర్మాణంతో సిలిగురి కారిడార్‌కు భూసంబంధాలు తెగిపోతాయని భావిస్తున్నదని, కల్లోలిత ఈశాన్య ప్రాంతాన్ని కట్టడి చేసేందుకు సిలిగురి కారిడార్‌ వ్యూహాత్మకంగా కీలకమని భారతీయులు అనుకుంటుండటమే ఇందుకు కారణమని రాసుకొచ్చింది. సిక్కింలోని సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య గత 20 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *