ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్.. కేటీఆర్‌

ఐటీరంగంలో మంత్రి కేటీఆర్ చేసిన కృషికి మరో గౌరవం దక్కింది. ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ గా స్కోచ్ అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. అటు ఇప్పటికే పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకున్న టీఎస్ఐపాస్ సైతం స్కోచ్ – స్మార్ట్ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైంది.

ఈ ఏడాది కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా స్కోచ్ అవార్డు ప్రదానం చేయనుంది. ఈనెల 9న ఢిల్లీలో స్కోచ్ 49వ సదస్సు జరగనుంది. అదే రోజు మంత్రి కేటీఆర్ ఈ అవార్డు అందుకోనున్నారు. గతేడాది కూడా మంత్రి కేటీఆర్ స్కోచ్ ఛాలెంజర్ అవార్డు అందుకున్నారు. ఇప్పటికే ఆధునిక సమాచార సాంకేతికతను సమర్థంగా వాడుకుంటూ ప్రభుత్వ సేవలను వినూత్నంగా అందిస్తున్నందుకు గాను తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ చేసిన కృషిని స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ అభినందించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమీర్ చెప్పారు. ఐటీరంగంలో కొత్త పాలసీల అమలులో కేటీఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆయన కొనియాడారు.

అవార్డుల ఎంపిక కోసం స్కోచ్ జ్యూరీ.. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2003 నుంచి స్కోచ్ సంస్థ పలు విభాగాల్లో అవార్డులు అందిస్తోంది. సంస్థకు చెందిన ప్రతినిధులు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరును నిశితంగా పరిశీలిస్తారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పనితీరుపై స్కోచ్ సంస్థ సమగ్ర వివరాలు సేకరించింది. గతంలో అవార్డులు అందుకున్నవారితో పాటు ఐటీ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. అటు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను స్టడీ చేసింది. ప్రతీ ఏడాది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 18 వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2016లో అనూహ్యంగా దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మర్ గా అవతరించింది. దీనికోసం ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను స్కోచ్ గ్రూప్ స్టడీ చేసింది. ఈ మేరకు 2017 కు గాను బెస్ట్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా మంత్రి కేటీఆర్ ను ఎంపిక చేసింది.

స్కోచ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడంపై మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ విజన్ తో పాటు తన శాఖలోని అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందం సహాయ సహకారాలవల్లే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *