బిగ్ బ్రేకింగ్: జయలలిత ఇంక సెలవేనా…!

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో అన్నాడీఎంకే విషాదం లో మునిగిపోయింది. ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావిస్తుండగా ఆమెకు మళ్లీ గుండెపోటు వచ్చిందన్న వార్తతో రాష్ట్రం దిగ్ర్భాంతికి గురైంది. 74 రోజుల క్రితం (సెప్టెంబరు 22వ తేదీన) డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో జయ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. లండన్ వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు జీసీ గిలాని (పల్మనరీ మెడిసిన స్పెషలిస్ట్‌), అంజన ట్రికా (అనస్తీషియాలజిస్ట్‌), నితీష్‌ నాయక్‌ (కార్డియాలజిస్ట్‌) (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ వ్యక్తిగత వైద్యుడు), సింగపూర్‌ ఫిజియోథెరపీ నిపుణులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటోందని అందరు భావిస్తుండగా ఆమె పరిస్థితి విషమంగా వుందని వార్తలు రావడంతో ప్రజలు దిగ్ర్భాంతికి గురయ్యారు. ‘అమ్మ’కు అసలేమైందంటూ కార్యకర్తలు ఆరా తీయడం ప్రారంభించారు.
ఆస్పత్రి వద్ద పటిష్ట భద్రత…

సోమవారం రాత్రి సుమారు 7.30 గంటలకు జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి చేరు కున్నారు. అప్పటికే పోలీసు భద్రతను పెంచి, ట్రాఫిక్‌ కట్టుదిట్టం చేశారు. 8.30 గంటల ప్రాంతంలో రాష్ట్రమంతా అన్ని పోలీసు స్టేషన్లకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

బోరున విలపిస్తున్న కార్యకర్తలు…

జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వచ్చిన వార్తలతో భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. రాత్రి సమయంలోను వేలాదిగా తరలివచ్చారు. మహిళా కార్యకర్తలు భోరున విలపిస్తూ గుండెల్ని బాదుకున్నారు. అమ్మను కాపాడాలని అన్ని మతాలకు చెందిన కార్యకర్తలు తమ ఇష్టదైవాలను వేడుకున్నారు. ‘అమ్మ దైవంతో సమానం. అమ్మకేం కాదు. కోటిన్నర కార్యకర్తలు, 11 కోట్ల తమిళులు చేసిన ప్రార్ధనలు వృథాకావు. తప్పకుండా అమ్మ సురక్షితంగా బయటకి వస్తారు’ అంటూ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలకు ధైర్యం చెబుతూ కనిపించారు.

సర్వం బంద్‌…

10.30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రి ఉన్న గ్రీమ్స్‌ రోడ్డు రెండు ప్రవేశాలను బ్లాక్‌ చేశారు. వాహనాలను రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో నగరంలోని పెట్రోలు బంకులు, దుకాణాలన్నింటినీ మూసివేశారు.

ఆందోళనలో ప్రజలు…

రాత్రి 7.30 గంటల నుంచి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో జయలలిత ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో నగరవాసులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. బయట ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని త్వరగా ఇంటికి చేరుకోవాలని హెచ్చరించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *