‘జియో గిగా ఫైబర్’తో మరో సంచలనానికి జియో
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. టెలికాం చరిత్రలో జియో ఎంట్రీతో డేటా విప్లవానికి నాంది పలికిన సంస్థ రిలయన్స్ జియో. ఇప్పుడు ‘జియో గిగా ఫైబర్’ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవల ఆవిష్కారానికి రంగం సిద్ధం చేసింది. హై-స్పీడ్ ఫైబర్-టు-హోమ్ (ఎఫ్టిటిహెచ్) జియో గిగా ఫైబర్ ఆగస్టు 12న కమర్షియల్‌గా లాంచ్ చేయనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కాని అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది.
జియో గిగా ఫైబర్‌తో భారత దేశంలోని బ్రాండ్‌బాండ్‌తో పాటు డీటీహెచ్ టీవీ రంగంలో(బీటా ట్రయల్స్) ఇప్పటికే జియో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ జియో గిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. లాంచింగ్ వివరాలను స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, జియోగిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చాలా విజయవంతమయ్యాయి, 50 మిలియన్లకు పైగా వినియోగదారులే లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని ప్రకటించరు.
ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే బ్రాడ్ బ్యాండ్‌తో పాటు, ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పిస్తోంది. త్వరలోనే టీవీ సేవలను సైతం ప్రారంభించనుంది. 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ వరకూ 90 రోజుల పాటు ఉచిత సేవలను పొందవచ్చు. ఇందుకోసం ఛార్జీలు ఏవీ వసూలు చేయబోమని, కానీ, సెక్యురిటీ డిపాజిట్(రిఫండబుల్) కింద రూ.4,500 కట్టాల్సిందిగా రిలయన్స్ చెబుతోంది. అధికారికంగా సేవలు ప్రారంభమైన తర్వాత నెలసరి కనీస ప్లాన్ రూ.600 ఉంటుందని అంటున్నారు.