కర్ణాటక రాజకీయ మలుపులు…

కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్‌ వజూభాయ్‌ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేశ్‌ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు ఏడాదిన్నరగా అనూహ్య మలుపులు తిరుగుతున్నా కర్ణటక  రాజకీయాలు మరోసారి కీలక మలుపులు తిరిగాయి. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్ వాజుభాయ్ వాలా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడ్యూరప్ప సూచించారు. మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి.

కానీ.. కర్ణాటక రాజకీయాలు మరోసారి మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కర్ణాటకలో 224 మంది శాసనసభ్యులు ఉండగా.. విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు.. ఇలా 21 మంది బలపరీక్షలో పాల్గొనలేదు. విప్ అమల్లో ఉండటం వల్ల ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అదే జరిగితే వీరు బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతోపాటు ఉప ఎన్నికలు అనివార్యం.

సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీఎస్పీ, ఇండిపెండెంట్లను మినహాయించినా.. మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. లేకపోతే సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  కానీ ఓవైపు అండగా గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, అన్నింటి కంటే ముఖ్యంగా మోదీ చరిష్మాతో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు నెట్టుకొని రావచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *