సినిమాటిక్ సీన్ల సాకారం ఆ సీఎంకే సాధ్యం

కొన్ని సినిమాల్లోనే సాధ్యం. కాల్పానిక కథల్లో మాత్రమే కనిపించే దృశ్యాలు.. వాస్తవంలో ఆవిష్కరించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఫాంటసీల్ని సాకారం చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహా ఇష్టంగా ఉంటుంది. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. అది కూడా బొమ్మరిల్లు మాదిరిగా ఉండే ఇళ్లు బారులు తీరటమే కాదు.. ఆ ఇళ్లకు సీసీ రోడ్లు.. ప్రత్యేక కరెంటు లైన్లు.. నల్లా కనెక్షన్లు.. ప్రతి ఇంటికి గేదెలు.. కోళ్లు.. ఇలా పశు సంపదతో.. ఒకే ముహుర్తంలో.. ఒకేసారి.. వందలాది మంది వేద పండితుల సాక్షిగా పుణ్యదానం.. వాస్తు పూజలు లాంటివి రియల్ లైఫ్ లో సాధ్యమవుతాయి?

అది కూడా తూతూ మంత్రంగా కాకుండా.. శాస్త్రోక్తంగా.. సొంతింటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయేమో. ఏదైనా పెద్ద వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు మోడల్ హౌస్ ను సదరు కంపెనీ సిద్ధం చేస్తుంది. మార్కెటింగ్ ఎత్తులో భాగంగా ఇలాంటివి చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రీతిలో తన డబుల్ బెడ్రూం హామీని నెరవేర్చే క్రమంలో తన దత్తత గ్రామంలో షురూ చేసిన ఇళ్లే నిర్మాణం.. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా మారుతుందని చెప్పాలి.

kcr-inaugurated-double-bed-room-houses-in-eravelly
kcr-inaugurated-double-bed-room-houses-in-eravelly

పేదలకు ఇళ్ల కేటాయింపు అంటే.. అదెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ.. అలాంటి దానికి భిన్నంగా.. ఏదైనా ప్రైవేటు సంస్థ.. తన కమర్షియల్ ప్రాజెక్టును సైతం ఇంత బాగా  తయారు చేయలేదనిపించేలా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల ఏర్పాటు ఉందని చెప్పక తప్పదు. సామూహికంగా ఇళ్ల నిర్మాణం మొదలు.. ఒకేరోజు ఫిల్లర్లు.. స్లాబ్ వేసి కట్టటమే కాదు.. ఒకే రోజు లబ్థిదారులందరికి ఇళ్లనుఅప్పగించే ఈ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇస్తుందంటే అవి ఎలా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి చేతలతో చూపించారని చెప్పాలి.

తాను చేసేఏ కార్యక్రమం అయినా రిచ్ గా.. గ్రాండ్ గా ఉండేందుకు ఇష్టపడే కేసీఆర్.. పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. ఎగువ మధ్యతరగతి జీవులకు సైతం అసూయ పుట్టించేలా ఉందనటంలో సందేహం లేదు. లక్షలాదిగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తానన్న హామీని కేసీఆర్ నెరవేర్చకున్నా ఫర్లేదన్నట్లుగా తాజాగా తయారు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్నాయని చెప్పాలి. రాశి కంటేవాసి ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరుతో.. కేసీఆర్ కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

నిజానికి ప్రస్తుతం సిద్ధం చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లు కేవలం 530మాత్రమే. కానీ.. ఐదులక్షలు ఇళ్లు కట్టించినా రానంత మైలేజీని.. కూసిన్ని ఇళ్ల నిర్మాణంతోనే సొంతం చేసుకోవటం కేసీఆర్ తెలివికి నిదర్శనంగా చెప్పక తప్పదు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో 344.. నర్సంపేటలో 186 ఇళ్లను సిద్ధం చేసిన కేసీఆర్ తేల్చిచెప్పింది ఒక్కటేనని చెప్పాలి. తాను ఇచ్చిన హామీ అమలులో కాస్త ఆలస్యం కావొచ్చుకానీ.. చేసే పని ఎంత గ్రాండ్ గా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి.. తన మాదిరి సంక్షేమ కార్యక్రమాల అమలు మరెవరూ చేయలేరన్న విషయాన్నిస్పష్టంచేశారని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *