భోజనం చేసి.. 6.30 గంటలు వారితోనే కేసీఆర్

విలక్షణంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత  బాగా ఎవరికి తెలీదు. ముడుచుకుపోయినట్లుగా వ్యవహరించే ఆయన.. కొన్ని సందర్భాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. వాస్తవానికి కేసీఆర్ ను కలవాలన్నా.. ఆయన కలిసి మాట్లాడాలన్నా.. సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా సాధ్యం కాదు. ఎందుకలా అంటే.. అదంతే అని మాత్రమే చెప్పగలం.

ఆయనకు నచ్చినప్పుడు నచ్చిన అంశం మీద మాట్లాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలే కానీ.. ఒక ప్లాన్ ప్రకారం.. పద్దతి ప్రకారం రివ్యూ సమావేశాలు జరగవు. సీఎంకేసీఆర్ ను జాగ్రత్తగా ఫాలో అయితే.. కొన్నిరోజుల పాటు ఎవరిని కలవకుండా ఉండే ఆయన.. మరికొన్ని రోజులు మాత్రం నాన్ స్టాప్ గా భేటీలు నిర్వహించటమే కాదు.. సుదీర్ఘంగా చర్చా గోష్ఠిల్ని నిర్వహిస్తుంటారు.

ఎక్కడి దాకానో ఎందుకు కేసీఆర్ పుట్టిన రోజు నాడు జనహితం పేరిట జర్నలిస్టులతో నిర్వహించిన కార్యక్రమాన్నే చూడండి.. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఏకబిగిన ఉండిపోయారు. ఆదివారం ముచ్చటే తీసుకుంటే.. చేనేతల వెతల మీద సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి.. వారితో కలిసి భోజనం చేశారు. ఇక్కడితో ఆగిందా.. సోమవారం తెలంగాణలో అత్యంత వెనుకబడిన తరగతుల కులాల ప్రతినిదులతో కలిసి భేటీని నిర్వహించారు. దీనికి ఏకంగా ఆయన కేటాయించిన సమయం ఎంతో తెలుసా? ఆరున్నర గంటలు. ప్రతినిధులతో భోజనం చేయటం మొదలు.. వివిధ అంశాలపై పలు నిర్ణయాల్ని తీసుకునే వరకూ ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. ఇలాంటి మారథాన్ భేటీలు నిర్వహించటం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరే అధినేతకు రాదనే చెప్పాలి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆరున్నర గంటల పాటు కేసీఆర్ భేటీ నిర్వహించిన తర్వాత.. బయటకు వచ్చే ప్రతినిదులు మరింత హుషారుగా రావటం. వాస్తవానికి ఇంత సుదీర్ఘమైన భేటీలతో తలబొప్పి కట్టినట్లుగా ఫీల్ అవుతారు. కానీ.. కేసీఆర్ తో భేటీ అంటే.. గంటలు నిమిషాలుగా గడిచిపోవటమే కాదు.. ఆయన మాటలు ఆసక్తికరంగా సాగి.. అస్సలు బోర్ కొట్టని రీతిలో ఉంటాయని చెబుతారు.

ఈ మాటల్ని వివిద వర్గాల నేతలే కాదు.. సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చెప్పటం ఒక విశేషంగా చెప్పాలి. ఎందుకంటే.. వారి అనుభవంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూసి ఉంటారు.కానీ.. వారికి కేసీఆర్  మాత్రం కాస్త ప్రత్యేకమైన సీఎంగానే అభివర్ణిస్తుంటారు. ఇక.. అత్యంత వెనుకబడిన తరగతుల కులాలు (ఎంబీసీ)ల సమస్యలపై దృష్టి సారించిన కేసీఆర్.. వారికి ప్రత్యేక ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేయటంతో పాటు.. ఆ కులాల వెనుక తాను ఉంటానన్న భరోసాను ఇచ్చారు.

వెనుకబడిన కులాల కుల వృత్తులు  క్షీణిస్తున్నాయని.. బీసీల్లో ఉన్పప్పటికీ గత ప్రభుత్వాలుతగిన శ్రద్ధ చూపించలేదన్న ఆయన.. ఎంబీసీలను గుర్తించి.. ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిని తెలుకొని.. వారి అవసరాల మేరకు ప్రభుత్వం చేయూతను అందించనున్నట్లుగా ప్రకటించారు. రాజకీయ జోక్యం లేకుండా కార్పొరేషన్ ను నడిపించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని గుర్తించి వారికి మరింత నైపుణ్యాన్ని అందించటమే కాదు..ఆర్థికసాయాన్ని.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని.. కులవృత్తి నశించి..ఆర్థికంగా చితికిపోయిన వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించనున్నట్లుగా చెప్పారు. చూస్తుంటే.. కులాల వారీగా వివిధ వర్గాల మనసుల్ని దోచుకునే ప్రోగ్రాంను కేసీఆర్ చేపట్టినట్లుగా అనిపించట్లేదు?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *