ఎమ్మెల్యే బాబుమోహన్‌పై కేసీఆర్ చేయించిన సర్వేలో తేలిన నిజాలేంటి..?

సంగారెడ్డి జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం ఆందోల్‌.. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్‌కు చెందిన సిలవేని రాజనరసింహ చాలా కాలం ప్రాతినిధ్యం వహించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి… పీవీ నరసింహారావు.. అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రాజనరసింహ తిరుగులేని నాయకుడు! ఆందోల్‌ నియోజకవర్గం ప్రజలు ఎక్కువ సార్లు స్థానికేతరులే పట్టం కట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే బాబూమోహన్‌.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ కూడా స్థానికేతరులే! రాజనరసింహ తర్వాత వారసత్వంగా ఆయన కుమారుడు దామోదర్‌ రాజకీయాలలోకి వచ్చారు. దామోదర్‌ కూడా ఆందోల్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొదటి నుంచి ఆందోల్‌ వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా తక్కువే! తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ కొంత చైతన్యం వచ్చిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ నుంచి గెలిచినవారంతా వ్యక్తిగత ప్రయోజనాలు పొందారే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
             రాజనరసింహతో పాటు ఆయన కుమారుడు దామోదర్‌ కూడా మంత్రిగా పని చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవినే చేపట్టారు దామోదర్‌! ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో మల్యాల రాజయ్య మంత్రిగా పని చేశారు. చంద్రబాబు హయాంలో బాబూమోహన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది.. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగలేదన్నది స్థానిక ప్రజల ఆరోపణ!
            ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాలలో ఎన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది.. అలాగని ఆందోల్‌ కాంగ్రెస్‌ నేతలు చెప్పుకు తిరుగుతున్నారు. ఎందుకంత సంబరమని ఎవరైనా అడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే! ముఖ్యమంత్రి కేసీఆర్‌ జరిపించిన సర్వేలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ కంటే దామోదర్‌కే ఎక్కువ మార్కులు పడటాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి లైన్‌ క్లియర్‌ అయినట్టేనంటున్నారు. సర్వేలో దామోదర్‌కు ఎడ్జ్‌ లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి రెడీ అవుతున్నారట కార్యకర్తలు. గత ఎన్నికలలో రెండువేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన దామోదర్‌కు ఈసారి భారీ మెజారిటీ ఖాయమంటున్నారు. కేసీఆర్‌ సర్వేలో బాబూమోహన్‌ వెనుకబడటం కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే అంశమట! ఇప్పటికే ఆందోల్‌లో కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు దామోదర్‌తో టచ్‌లో ఉన్నారట! 2014 ఎన్నికల్లో తెలంగాణవాదానికి ఓటేసి గెలిపించామే తప్ప బాబూమోహన్‌ను చూసి కాదని చెబుతున్నారట గులాబీదళంలోని కొందరు నేతలు! దామోదర్‌, బాబూమోహన్‌ ఇద్దరిలోనూ అహంభావం కొంచెం ఎక్కువే అయినా సొంత పార్టీ వాళ్లను తెగ ఇబ్బంది పెడుతున్న బాబూమోహన్‌ను ఇంటికి పంపేందుకు దామోదర్‌వైపు చూస్తున్నారన్న టాక్‌ ఇక్కడ వినిపిస్తోంది..
             మొన్నటి వరకు ఆందోల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఓ రకమైన నిస్తేజం ఆవరించి ఉండేది.. కాంగ్రెస్‌ పార్టీ విజయంపై వారిలో నమ్మకం సడలింది.. కేసీఆర్‌ సర్వేలో బాబూమోహన్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికన్నా వెనుకబడటం కాంగ్రెస్‌కు బలాన్ని ఇచ్చినట్టయ్యింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కనీసం నమ్ముకున్న లీడర్లు గెలిస్తే చాలని అనుకుంటున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగులేని పరపతి ఉందట! పైగా తెలంగాణ ఏర్పాటు కోసం దామోదర్‌ బాగానే కష్టపడ్డారట! ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దామోదరే పెద్ద దిక్కుగా ఉంటున్నారట! వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా దామోదర్‌ను గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాయట కాంగ్రెస్‌ శ్రేణులు! అధికారంలో ఉన్నప్పుడు దామోదర్‌ తమను పట్టించుకోని మాట వాస్తవమే అయినా.. ఆయన్ను గెలిపించుకోవడం ఇప్పుడు అనివార్యమయ్యిందంటున్నారు కార్యకర్తలు. బాబూమోహన్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కార్యాచరణను రూపొందించుకుంటున్నారట! మరి కాంగ్రెస్‌ శ్రేణుల ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి..
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *