ప్రపంచకప్ నిష్క్రమణపై స్పందించిన కోహ్లీ…

కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ప్రపంచకప్‌లో టీమిండియా నిష్క్రమణపై స్పందించాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేదని, ఆ తర్వాత రోజు వారీ కార్యక్రమాల్లో పడి మర్చిపోవడానికి ప్రయత్నించామని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

వెస్టిండీస్‌ పర్యటనకు భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని గైర్హాజరీ కావడం యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తనలోని నైపుణ్యాన్ని మరింత బయటపెట్టడానికి మంచి అవకాశమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో శనివారం వెస్టిండీస్‌తో తొలి టీ20కి టీమిండియా సన్నద్ధమైన తరుణంలో పంత్‌ను ప్రశంసించాడు కోహ్లి. రిషభ్‌ పంత్‌ ఒక నైపుణ్యమున్న ఆటగాడు. విండీస్‌ పర్యటనలో అతను సత్తాచాటడానికి ఇదొక మంచి తరుణం. అందుకు పంత్‌ కూడా సిద్ధంగా ఉన్నాడని, లోయర్‌ మిడిలార్డర్‌లో పంత్‌ తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకొని ధోనీ, పాండ్యలేని లోటును తీర్చాలని కోరాడు.

విండీస్‌ పర్యటనకు సెలక్టర్లు హార్దిక్‌పాండ్యకు విశ్రాంతినివ్వగా.. ధోనీ స్వతహాగా రెండు నెలలపాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశమిచ్చామని కోహ్లీ పేర్కొన్నాడు. నేటి నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో నెల రోజులపాటు తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడాలోని సెంట్రల్‌ బ్రోవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియంలో ఆడనుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *