అప్పుడే రాజకీయాలను వదిలేద్దామనుకున్నా: కేటీఆర్

హైదరాబాద్: 2008లోనే తాను రాజకీయాలను వదిలేద్దామనుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వం వహించిన’శరణం గచ్ఛామి’ చిత్ర గీతాల్ని ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘2008 ఉప ఎన్నికలలో మా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిగా నిరాశలో కూరుకుపోయాం. ఆ దశలో కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అయిపోవాలేమో అనిపించింది. అదే జరిగితే రాజకీయాలు వదిలేద్దామనుకొన్నా. అదే సమయంలో ఓ పత్రికలో చదివిన వ్యాసం నన్ను ఉత్తేజితుణ్ని చేసింది. ఆ వ్యాసం రాసింది ప్రేమ్‌రాజ్‌ అని తెలిసింది. ఆయన్ని కలుసుకొని మాట్లాడా’ అని కేటీఆర్ చెప్పారు.

‘మా ప్రభుత్వం ఏర్పడి ఇన్నేళ్లయినా ఆయన ఏనాడూ ఏ సహాయమూ అడగలేదు. ఆయన తీసింది మూడు సినిమాలే. అయినా రాశి కాదు వాసి ముఖ్యమని చాటారు. ఈ చిత్రానికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

‘ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. దమ్ముంటే అదే పెద్ద సినిమా. ఆ సత్తా ‘శరణం గచ్ఛామి’లో కనిపిస్తోంది’అని అన్నారు కేటీఆర్‌. ‘సినిమా ఓ వ్యాపారం. మొదటి రోజే డబ్బులన్నీ వచ్చేయాలన్న లెక్కలుంటాయి, అలాంటి దశలో ఈ తరహా కథని ఎంచుకోవడం సాహసమేనని చెప్పారు. ‘బీఎమ్‌డబ్ల్యూ అక్కర్లేదు.. ఇంట్లో బియ్యం ఉంటే చాలనుకొనే వ్యక్తిని నేను. సమాజానికి మంచి చెప్పే సినిమాలే చేద్దామనుకొన్నా. ఇదివరకు తీసిన రెండు చిత్రాలూ అలాంటివే. ఈసారి రిజర్వేషన్‌ల గురించి చర్చిస్తూ ఓ కథ చెప్పా’అని దర్శకుడు ప్రేమ్‌రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, ఆర్‌ కృష్ణయ్య, జెబి రాజు, సానా యాదిరెడ్డి, విమలక్క, పిడమర్తి రవి, అల్లాణి శ్రీధర్‌, కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ‘శరణం గచ్ఛామి’కి రవికళ్యాణ్ సంగీతం అందించారు. నవీన్‌ సంజయ్‌, తనిష్క్‌ తివారీ జంటగా నటించారు. బొమ్మకు మురళి నిర్మాత.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *