జాదవ్ ఫ్యామిలీపై పాక్ మీడియా వీరంగం

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని ఏమీ అనలేని పాక్ మీడియా.. భారత్ మీద తనకున్న విద్వేషాన్ని వెళ్లగక్కింది. పాక్ మాదిరే తమ మనసుల్లో ఉన్నవిషాన్ని.. కుళ్లను బయటకు వెళ్లగక్కి మనోళ్లను అవమానించిన వైనం బయటకు వచ్చింది.

పాకిస్థాన్ అక్రమ నిర్భందంలో ఉన్న జాదవ్‌ను చూసేందుకు అతడి కన్నతల్లిని.. కట్టుకున్న భార్యను.. పాక్ సర్కారు అనుమతించిన సంగతి తెలిసిందే. కొడుకును చూసుకునేందుకుఆ తల్లి.. భర్తను చూసుకునేందుకు భార్య ఎంతో అతృతగా ఇస్లామాబాద్‌కు వెళ్లిన జాదవ్ ఫ్యామిలీకి దారుణ రీతిలో అవమానాలు ఎదురయ్యాయి. పాక్ సర్కారు మాత్రమే కాదు.. పాక్ మీడియా సైతం అలాంటి తీరునే ప్రదర్శించటం గమనార్హం.

జైల్లో కన్నబిడ్డను చూసుకునేందుకు అద్దాల పెట్టెలో చూపించి.. కనీసం చేతుల్ని పట్టుకోవటానికి కూడా పాక్ అధికారులు అవకాశం ఇవ్వని వైనం తెలిసిందే. ఇక.. జాదవ్ సతీమణి మెడలోని మంగళసూత్రాన్ని తీయించిన తర్వాతే జాదవ్‌ను చూసేందుకు అనుమతి ఇవ్వటంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. జాదవ్ ను జైల్లో చూసి బయటకు వచ్చిన కుటుంబ సభ్యుల్ని అక్కడి మీడియా చుట్టుముట్టి మాటలతో కుళ్లబొడిచే ప్రయత్నం చేయటం గమనార్హం.

వాస్తవానికి ముందుగా అనుకున్న దాని ప్రకారమైతే.. జాదవ్ ఫ్యామిలీ జైలు దగ్గరకు వచ్చిన వేళలో.. మీడియాను అనుమతించకూడదని భావించారు. అయితే.. రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. మీడియాను అనుమతించేసింది పాక్ ప్రభుత్వం. దీంతో.. వారిపై పాక్ మీడియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది . జాదవ్ తల్లి.. సతీమణి కారు వద్దకు వెళ్లే లోపే చుట్టుముట్టిన మీడియా.. వారిపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

దారుణమైన వ్యాఖ్యలతో వారిని తీవ్ర అవమానానికి.. మానసిక వేదనకు గురి చేయటంపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హంతకుడి తల్లిగా జాదవ్ తల్లిని పాక్ మీడియాప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించటం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. హంతక కొడుకును చూసేందుకు అనుమతిని ఇచ్చిన పాక్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతారా? అంటూ మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించటంపై పలువురు తప్పు పడుతున్నారు.

జాదవ్ సతీమణిని సైతం పాక్ మీడియా వదిలిపెట్టలేదు. నీ భర్త కారణంగా అమాయకులైన ఎంతోమంది పాకిస్థానీయులు ఊచకోత కోశాడని.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించటంతో వారి నోట మాట రాకుండా షాక్ తిన్నట్లు ఉండిపోయారు. పాక్ మీడియా తీరును పలువురు తప్పు పడుతున్నారు. పాక్ మీడియాపై భారత మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాదవ్ ఫ్యామిలీకి ఎదురైన అవమానాలపై భారత మీడియా తప్పు పడుతోంది.దీనిపై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *