లాల్ బాగ్‌ చా రాజాకు కాసుల వర్షం…

ముంబై లాల్‌బాగ్ చా రాజాకు కాసుల వర్షం కురిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పించారు.  లెక్కింపులో మొత్తం రూ. 5.8 కోట్ల నగదు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో రూ.1.1 లక్షల కరెన్సీ రద్దైన పాతనోట్లు ఉన్నాయని వెల్లడించారు. నగదుతోపాటు 5.5 కేజీల బంగారం, 70 కేజీల వెండి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.

కాగా, గతేడాది రూ.8కోట్ల డొనేషన్లు రాగా, ఈసారి అది రూ.5.5 కోట్లకు పడిపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. పండుగ సమయంలో భారీ వర్షాలు కురవడం, నోట్ల రద్దు తదితర కారణాలు ఇందుకు దోహదం చేసినట్టు చెప్పారు. వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్టు లాల్‌బాగ్చారాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ అధ్యక్షుడు బాలాసాహెబ్ కుంబ్లే వెల్లడించారు.

ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్ బాగ్ చా రాజా గొప్ప విశిష్టత ఉంది. 1932లో ముంబైలోని ‘పెరు చాల్’ వద్ద ఉన్న మార్కెట్ మూతపడడంతో ఇక్కడి చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. మార్కెట్  కోసం తమకు మంచి స్థలం లభిస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని మొక్కుకొన్నారు. ఫలితంగా వారికి లాల్‌బాగ్‌లో ప్రాంతంలో స్థలం లభించింది. దీంతో ఇదే లాల్‌బాగ్ మార్కెట్‌లో 1934 సెప్టెంబర్ 12వ తేదీ న ఉత్సవాలు ప్రారంభించారు.

తొలినాళ్లలో చిన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇదే నేడు మహామండలిగా ఎదిగి లక్షలాది భక్తులకు తీర్థస్థలంగా మారింది. నాటి నుంచి నేటి వరకు రత్నాకర్ కాంబ్లీ వంశస్తులు లాల్‌బాగ్‌చా రాజా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ వస్తున్నారు. భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన లాల్‌బాగ్ చా రాజాను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది జనం తరలి వస్తుంటారు. ఇక్కడ రెండు వేర్వేరు క్యూలు ఉంటాయి. ఒకటి మొక్కుబడులు తీర్చుకునేది. రెండోది కేవలం దర్శనం చేసుకుని ముందుకుసాగేది

లాల్‌బాగ్‌చా రాజా మండలికి భారీ మొత్తంలో వచ్చే డబ్బు, బంగారం, ఇతర కానుకలు, విలువైన వస్తువులను మండలి స్వచ్ఛందంగా సేవల కోసం వినియోగిస్తోంది. బీహార్‌లో వరదలు వచ్చినప్పుడు,  1962, 1968 యుద్ధ సమయాల్లో కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *