రివ్యూ: మేడ‌మీద అబ్బాయి

క‌థః 
శీను(అల్ల‌రి న‌రేష్‌) జీవితం అంటే సీరియ‌స్ లేకుండా ఉండే కుర్రాడు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబీకులైన అత‌ని త‌ల్లిదండ్రులు శీను తాహ‌త‌కు మించి అప్పు చేసి ఇంజ‌నీరింగ్ చ‌దివిస్తారు. జీవితం అంటేనే సీరియ‌స్‌గా తీసుకోని శీను ఇక చ‌దువు సంగ‌తిని ఏం ప‌ట్టించుకుంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంజ‌నీరింగ్‌లో శీను 24 స‌బ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతాడు. ఇంటికి చేరుకున్న శీను, త‌ల్లిదండ్రులు తిడుతున్నా ప‌ట్టించుకోకుండా స్నేహితుల‌తో క‌లిసి తిరుగుతుంటాడు.చుట్టూ ప‌క్క‌ల ఉన్న అమ్మాయిల‌ను సైట్ కొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో శీను ప‌క్క ఇంట్లోకి సింధు(నిఖిలా విమ‌ల్‌) అద్దెకు దిగుతుంది. శీను, సింధుని లైన్‌లో పెట్ట‌డానికి త‌న ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు కానీ సింధు శీనుని ప‌ట్టించుకోదు. ఇలాంటి త‌రుణంలో శీను, చిన్న‌నాటి స్నేహితుడు బాబ్జీ(హైప‌ర్ ఆది)తో క‌లిసి ఓ షార్ట్‌ఫిలిం చేస్తాడు. దాంతో ఎలాగైనా పెద్ద డైరెక్ట‌ర్ అయిపోవాల‌ని క‌ల‌లు కంటాడు. అయితే ఆ క‌ల‌లు కూడా నీరుగారిపోతాయి. తండ్రి కిరాణ షాప్‌లో కూర్చోమ‌ని చెప్ప‌డంతో, ఎలాగైనా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని హైద‌రాబాద్ చేరుకుంటాడు. త‌న ప్ర‌య‌త్నాలు ప‌లించ‌క పోవ‌డంతో శీను ఊరు చేరుకుంటాడు. అయితే అప్ప‌టికే ఊర్లోని అంద‌రూ సింధుని శీను లేవ‌దీసుకుపోయాడ‌ని న‌మ్ముతుంటారు. ఊరికి వ‌చ్చిన శీను నిజం చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌రు. అప్పుడు శీను ఏం చేస్తాడు? అస‌లు సింధు ఏమౌతుంది? చివ‌ర‌కు శీను, సింధును క‌లుసుకుంటాడా? అస‌లు ధ‌నుంజ‌య్‌, హ‌రినారాయ‌ణ్‌, ఉద‌య్‌భాస్క‌ర్‌ల‌కు సింధుకు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుస‌కోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణః
కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న న‌రేష్ ఈసారి స్పూఫ్‌లు, ఇమిటేష‌న్‌లు చేయ‌కుండా చేసిన సినిమా ఈ మేడ మీద అబ్బాయి. పూర్తిగా ట్రాక్ మార్చి చేశాడ‌నే చెప్పాలి. అయితే అల్ల‌రి న‌రేష్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్, న‌ట‌న ఏమైనా కొత్త‌గా ఉండి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా? అంటే అదీ లేదు. న‌రేష్ క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్‌కే ఎక్కువ స‌మ‌యం తీసేసుకున్నాడు. ఇక ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో న‌రేష్ చేసిన మినిమం కామెడి కూడా సెకండాఫ్‌లో క‌న‌ప‌డ‌దు. ఇక నిఖిలా విమ‌ల్..ప్రేమికుడిని వెతుక్కుంటూ తిరిగే ప్రేయ‌సి పాత్ర‌లో న‌టించింది. డీసెంట్ లుక్‌లో క‌న‌ప‌డింది. పెర్ఫామెన్స్ ప‌రంగా ఓకే అనిపించింది. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో మెయిన్ క్యారెక్ట‌ర్ హైప‌ర్ ఆది. జ‌బ‌ర్‌ద‌స్త్ కామెడి షోతో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదే త‌ర‌హా పంచ్‌లు, ప్రాస‌లు, కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.
ఇక సినిమాలో నాలుగో ముఖ్య‌మైన పాత్ర అవ‌స‌రాల శ్రీనివాస్ ప్రైవేట్ డిటెక్టివ్‌గా చ‌క్క‌గా న‌టించాడు. సింధు, శీను, బాబ్జీకి స‌హాయ‌ప‌డే పాత్ర‌లో అవ‌స‌రాల మెప్పించాడు. పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చేలా న‌టించాడు. ఇక హీరో త‌ల్లిదండ్రుల పాత్ర‌ల్లో జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, ర‌విప్ర‌కాష్‌, స‌హా మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ విష‌యానికి వ‌స్తే, ద‌ర్శ‌కుడు ప్ర‌జిత్ మ‌ల‌యాళంలో ఉన్న సినిమాను తెలుగులో అలాగే తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ క‌థ‌లోని సోల్ మిస్స‌య్యింది. సినిమాలో చివ‌రి ప‌దిహేను నిమిషాలు త‌ప్ప‌, మ‌రేం ఉండ‌దు. సోష‌ల్ మీడియా, దాని దుష్‌ప్ర‌భావం అనే చిన్న పాయింట్‌ను ప‌ట్టుకుని సాగ‌తీశాడు. షాన్ రెహ‌మాన్ సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీలా ప‌డింది. ఉన్ని ఎస్‌.కుమార్ సినిమాటోగ్ర‌ఫీ జ‌స్ట్ ఒకే. మొత్తంగా చూస్తే..అల్ల‌రి న‌రేష్ సినిమాల‌ను అమితంగా ఇష్ట‌పడేవారు ఓ సారి చూసే సినిమా.
సంస్థః జాహ్న‌వి ఫిలింస్‌
రేటింగ్ః 2.75/5
న‌టీన‌టులుః అల్ల‌రి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హైప‌ర్ ఆది, జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, సుధ‌, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్ త‌దిత‌రులు
సంగీతంః షాన్ రెహ‌మాన్
ఆర్ట్ః రాజీవ్ నాయ‌ర్‌
ఎడిటింగ్ః నంద‌మూరి హ‌రి
సినిమాటోగ్ర‌ఫీః ఉన్ని ఎస్‌.కుమార్‌
నిర్మాతః బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్‌
ద‌ర్శ‌క‌త్వంః జి.ప్ర‌జిత్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *