నేటి నుంచే అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నసమ్మక్క సారక్క మహాజాతర

అపూర్వమైన ఏర్పాట్ల మధ్య మేడారం జాతరకు బుధవారం తెరలేవనున్నది. గద్దెల దిశగా పగిడిద్దరాజు పయనం మొదలైంది. ఆ వెనుకే గోవిందరాజు కదులుతున్నాడు. కన్నెపల్లి నుంచి జంపన్నను సంపెంగవాగు దగ్గరున్న రావిచెట్టువద్ద పూజారి పూనం సత్యం ప్రతిష్ఠించారు. ఇక తదుపరి తమ వంతేనని సారక్క, సమ్మక్క సన్నద్ధమవుతున్నారు. పోటెత్తిన భక్తజనంతో మేడారం కిటకిటలాడుతున్నది. ఏ ఒక్క భక్తునికీ అసౌకర్యం కలుగకూడదన్న సీఎం కే చంద్రశేఖరరావు విస్పష్టమైన ఆదేశాలతో అధికారులు సమస్తమైన ఏర్పాట్లు జరిపారు. మేడారంలో సమ్మక్క-సారక్క మహాజాతర బుధవారం ప్రారంభం కానున్నది. నాలుగురోజులు జరిగే ఈ జాతర ఫిబ్రవరి 3వ తేదీన ముగుస్తుంది. అడవిమార్గం గుండా గద్దెలవైపు పగిడిద్దరాజు ప్రయాణం మంగళవారమే మొదలైంది. మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలకు చేరుకోవడంతోనే జాతర మొదలవుతుంది. ఆ వెనుకే కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. జాతర తొలిరోజు బుధవారం సారక్క మేడారంలోని గద్దెకు చేరుకుంటుంది.

మేడారం సమీపంలోని కన్నెపల్లి నుంచి పూజారులు సారక్కను తీసుకొస్తారు. సారక్కను తీసుకురావటానికి బుధవారం మధ్యాహ్నం జిల్లా జాయింట్ కలెక్టర్ డీ అమయ్‌కుమార్, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌రావు ఆరుగురు సారక్క పూజారుల వెంట కన్నెపల్లికి వెళ్తారు. కాక సారయ్య, కిరణ్, కనుకమ్మ, భుజంగరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయమ్మ సారక్క పూజారులుగా ఉన్నారు. ఈ ఆరుగురు బుధవారం ఉదయం కన్నెపల్లిలోని సారక్క గుడిని శుభ్రంచేసి పూజలుచేస్తారు. ముందు సమ్మక్క పూజారులు వనంలోకి వెళ్లి కంకబొంగు తెచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ అధికారులతో కలిసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత కన్నెపల్లిలోని సారక్క గుడి నుంచి అమ్మవారిని తీసుకుని మేడారం బయలుదేరుతారు. ప్రధాన పూజారి కాక సారయ్య అధికారులతో కలిసి మేడారంలోని గద్దెల ప్రాంగణంలో గద్దెపై సారక్కను ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతరలో తొలిఘట్టం ప్రారంభం అవుతుంది.

రెండోరోజు గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు మేడారంలోని గద్దెపైకి చేరుస్తారు. మూడో రోజు శుక్రవారం భక్తులు గద్దెలను దర్శించుకుంటారు. చివరిరోజు శనివారం సాయంత్రం సమ్మక్కసారక్క వనప్రవేశంతో మహాజాతరకు తెరపడుతుంది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూయల్ ఓరం శుక్రవారం మేడారంలో తల్లులను దర్శించుకుంటారు. సీఎం హోదాలో కేసీఆర్, ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు మేడారం రావటం ఇదే తొలిసారి. గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మేడా రం వనదేవతలను దర్శించుకుంటారు.

గిరిజనుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్న పగిడిద్దరాజు మంగళవారం మేడారానికి బయలుదేరాడు. రెండేండ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాకతోనే ప్రారంభమవుతుంది. మేడారానికి పగిడిద్దరాజును వరుడిగా తయారుచేసి తరలించడం అనవాయితీ. ఇక్కడి పెనక వంశీయులైన పూజారులు అరణ్యం గుండా 70 కిలోమీటర్లకుపైగా కాలినడకన గోవిందరావుపేట మండలం కర్లపెల్లి లక్ష్మీపురానికి చేరుకుని అక్కడి పెనక వంశీయుల కుటుంబీకులతో సేదదీరి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు మేడారం చేరుకుంటారు. అప్పుడే జాతర ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కాక లింగయ్య అధికారికంగా వచ్చి పగిడిద్దరాజును మేడారానికి పయనింపజేశారు. కార్యక్రమంలో పెనక వంశీయులు మురళీధర్, బుచ్చిరాములు, రామనాథం, పురుషోత్తం, తలపతులు లక్ష్మీనర్సు, వడ్డెలు జగ్గారావు, శివవడ్డెలు పూనెం భిక్షపతి, ఐలొబోయిన జగ్గారావు, వెంకటేశ్వర్లు పగిడిద్దరాజును భక్తిశ్రద్ధలతో కొలిచి మేడారానికి తీసుకెళ్లారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *