అప్పుడు ఎంజీఆర్..ఇప్పుడు జయ..అదే రహస్యం

సెప్టెంబరు 22న అనారోగ్యంతో తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని గ్రేమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్ లో చేరింది మొదలు 75 రోజులుగా అంతా రహస్యమే. జయకు ఏమైందో తెలియక అభిమానులు – కార్యకర్తల్లో ఆందోళన అలాగే కొనసాగుతోంది. అదిప్పుడు పతాక స్థాయికి చేరింది.  నిజానికి జయలలిత రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ విషయంలోనూ అప్పట్లో ఇదే తీరు నడిచింది.  కొన్నాళ్లయితే ఆయన ఏ ఆసుపత్రిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. చివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అపోలో ఆసుపత్రిలోనే అంతిమ శ్వాస విడిచారు.

32 ఏళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విషయంలోనూ చెన్నైలో.. ఇదే ఆసుపత్రిలో.. ఇదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అనిశ్చితి.. ఇంతే రహస్యం.

సినిమాల్లో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగానూ తమిళనాడు ప్రజల మనసులను చూరగొన్నారు. తిరుగులేని నేతగా వెలుగొందారు. 1984 అక్టోబరు 5న ఆయన చెన్నైలోని గ్రేమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతతో చేరారు. అయితే.. ఆయన ఆసుపత్రిలో చేరడానికి ముందే పార్టీ – ప్రభుత్వ – కుటుంబ వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాను చావుబతుకుల్లో ఉన్న విషయం కానీ అపోలో ఆసుపత్రిలో ఉన్నానన్న సంగతి కానీ జనానికి తెలియనివ్వద్దని ఆయన సూచించారు.  అందుకే కాన్వాయ్ వంటివన్నీ పక్కన పెట్టి అత్యంత రహస్యంగా అప్పట్లో ఆయన్ను అపోలో ఆసుపత్రికి తెచ్చారు.

అయితే సీఎం కనిపించకపోవడంతో కొద్ది వ్యవధిలోనే విషయం బయటకొచ్చేసింది.  అప్పటికే ఆయనకు డయాల్సిస్ చేస్తున్నారు. కానీ.. అపోలో ఆసుపత్రి వర్గాలతో ఫరవాలేదన్నట్లుగానే ప్రకటన ఇప్పించారు. ఆస్తమా కారణంగా ఎంజీఆర్ ఇబ్బంది పడుతున్నారని చెప్పించారు. అయితే అక్టోబరు 16న ఎంజీఆర్ కు పక్షవాతం రావడంతో అపోలో వర్గాలు మెడికల్ బులెటిన్ లో ఆ విషయం వెలుగులోకి తెచ్చాయి.  నిజానికి ఎంజీఆర్ కు కిడ్నీల సమస్య ఏర్పడిన సంగతి ఆయన ఆసుపత్రి పాలవడానికి నెలల ముందే బయటపడినా ఆయన భార్య జానకి రామచంద్రన్ – కొద్ది మంది వైద్యులకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎంజీఆర్ ఆసుపత్రిలో ఉన్నంత కాలం అపోలో ఆసుపత్రి నుంచే ఆయన మంత్రివర్గమంతా పనిచేసింది.. పాలన పడకేసింది. ఇప్పుడు జయ ఉదంతంలోనూ ప్రభుత్వం కేబినెట్ అంతా అపోలో ఆసుపత్రి కేంద్రంగానే పనిచేస్తున్నాయి.

ఇప్పుడు జయ కూడా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే తనకు ఏమైందో తెలియకుండా గోప్యత పాటించాలని గట్టి ఆదేశాలిచ్చారని సమాచారం. ఆ మేరకు అపోలో వర్గాలు తమిళనాడు ప్రభుత్వ సూచనల మేరకే చెప్పింది చెప్పినట్లుగా మెడికల్ బులెటిన్లు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఎంజీఆర్ 1984లో అపోలోలో సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్నా ఆ తరువాత అమెరికాలోనూ చికిత్స పొందారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. మళ్లీ 1985 ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగొచ్చి వరుసగా మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. గుండె పోటు రావడం… పక్షవాతం – డయాబెటిస్.. కిడ్నీల సమస్యలతో నిత్యం బాధపడుతూ తరచూ అమెరికా వెళ్లి చికిత్స చేయించుకునేవారు. 71 ఏళ్ల వయసులో 1987లో ఆయన మరణించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *