మోడీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తాను.. తన షోలు అన్నట్లు మాత్రమే ఉండే మెగా బ్రదర్ తాజాగా అదరగొట్టేశారు. వీలైనంత వరకూ తెర వెనుకే ఉంటూ.. తన అన్న చిరంజీవిని విపరీతంగా అభిమానించి.. ఆరాధించే నాగబాబు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని  ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఉందని చెబుతున్న నాగబాబు.. తన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ‘‘నా పాయింట్ ఆఫ్ వ్యూలో’’ అంటూ మోడీ తీసుకున్న నోట్ల రద్దుపై ఆయన తన మనసులో ఏమనుకుంటున్నది దాచుకోకుండా చెప్పేశారు. తాను మోడీ ఫాలోయర్ ని కాదని.. సగటు పౌరుడ్ని అని.. తాజాగా ప్రధాని తీసుకున్న నిర్ణయంపై తన అభిప్రాయాలు చెప్పాలనిపించిందంటూ చెప్పుకొచ్చారు.

నోట్ల రద్దుపై మోడీ తీరును రాజకీయ పక్షాలు తీవ్రంగా దునుమాడుతున్న వేళ.. మోడీ నిర్ణయం బ్రహ్మండం అని చెప్పటమే కాదు.. ఆయన నిర్ణయంపై వెల్లువెత్తుతున్న పలు విమర్శలకు కౌంటర్ అటాక్ చేసేలా వ్యాఖ్యలతో పాటు.. ఈ దేశానికి దమ్మున్న మగాడు లాంటి ప్రధాని మోడీ రూపంలో వచ్చారని చెప్పుకొచ్చారు. తన చిన్నతనం నుంచి ఒక భావన ఉండేదని.. ఈ దేశాన్ని ఒక నియంత పాలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. రద్దుపై తనకున్న అభిప్రాయాల్ని కుండ బద్ధలు కొట్టారు.

దమ్మున్న నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రిగా మోడీని అభివర్ణించిన ఆయన.. దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారిలో నెహ్రు.. ఇందిరాగాంధీ.. పీవీ నరసింహరావు.. వాజ్ పేయ్ లాంటి వారు కొంత ప్రయత్నం చేశారని.. కానీ వారు ఎవరూ తీసుకోనంత సాహసోపేతమైన నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారన్నారు. ప్రధానులుగా పని చేసిన వీరంతా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా.. నోట్ల రద్దు లాంటి భారీ నిర్ణయాన్ని మాత్రం తీసుకోలేదన్నారు.

చిన్నప్పటి నుంచి తనకో ఫీలింగ్ ఉండేదని.. దాదాపు 45 ఏళ్ల నుంచి తాను ఎదురుచూస్తున్నట్లుగా చెప్పిన నాగబాబు.. దేశాన్ని పాలించటానికి ఒక నియంత కావాలని.. ఎందుకంటే మన దేశంలో విపరీతమైన స్వేచ్ఛ ఉందని.. ఎవరిని ఎవరైనా తిట్టొచ్చు.. విమర్శ చేయొచ్చని.. దేశానికి అవసరమైన స్వేచ్ఛ కంటే ఎక్కువైందన్నారు. అయితే.. నియంత పాలకుడిగా వస్తే.. కొన్నాళ్ల తర్వాత ప్రమాదకరమైన వ్యక్తిగా మారొచ్చని.. కానీ.. మంచినిర్ణయాలు తీసుకునే కఠినమైన వ్యక్తి రావాలని అనుకున్నానని.. తన వెయిటింగ్ ఇన్నాళ్లకు నిజమైందన్నారు.

నోట్ల రద్దుతో సామాన్యులు విపరీతమైన కష్టాలు పడుతున్నారని చెబుతున్నారని.. విశాఖపట్నాన్ని హూదూద్ తుపాను ఊపేసినప్పుడు.. డబ్బులున్న సంపన్నుడు సైతం.. కాసిన్ని బియ్యం దొరికితే చాలని అనుకున్నాడని.. నెల రోజులు నానా తిప్పలు పడ్డారని.. గత ఏడాది చెన్నైలో భారీ వర్షాలు కురిసి మహా నగరం మొత్తం జల దిగ్బంధనం అయిపోతే..అక్కడిప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని.. నెల రోజుల పాటు నానా పాట్లు పడ్డారని.. అలాంటి వాటితో పోల్చి చూస్తే..ఈ రోజు అంత పెద్ద కష్టమైతే లేదుగా? వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఒక్క రూపాయి కూడా రావటం లేదన్న వాళ్లు ఒక్కరున్నారా చెప్పమనండి? అంటూ సూటిగా ప్రశ్నించిన నాగబాబు.. డబ్బులు కాస్త ఆలస్యంగా అందుతున్నాయని.. ఆ మాత్రం కష్టాన్ని భరించలేమా? అని వ్యాఖ్యానించారు.

ప్రతిచోటా వెధవలు ఉంటారని.. దమ్ముగా ఒక వ్యక్తి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అతనికి మద్దతుగా నిలవాల్సింది పోయి విమర్శలు చేయటం ఏమిటని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని.. ఆ సమయంలో తాను చిన్నపిల్లాడినని.. ఆమె తీసుకున్న ఆ నిర్ణయంతో దేశంలో కొన్ని రోజుల పాటు ఎవరూ నోరు విప్పి మాట్లాడలేకపోయారని.. అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు కదా? అని ప్రశ్నించారు. తనకు 50 రోజులు టైమివ్వాలని.. తనకు అండగా నిలబడితే.. తానేం చేయాలో చేసి చూపిస్తానని.. మార్పు తెస్తానని ఒక వ్యక్తి కోరితే.. మనం ఆయనకు ఆ మాత్రం టైమివ్వలేమా? అన్న నాగబాబు.. ఆ మాత్రం కో-ఆపరేషన్ ఇవ్వలేమా? అని అడిగారు.

ఈ నిర్ణయం వల్ల సినిమాలు కూడా ఆడవని.. ‘‘ఏం.. సినిమాలు ఆడకపోతే బతకలేమా?’’ అన్న మెగాబ్రదర్.. ప్రమాణస్వీకారం రోజునే మోడీ తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడని.. ఆ రోజే ఆయనకు రద్దు నిర్ణయం లాంటిది తీసుకోవాలని అనుకొని ఉండొచ్చన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు.. కనీసం ఒక నెల ముందే చెబితే బాగుండేది కదా అని చాలామంది అంటున్నారని.. అలా చెబితే.. దగ్గరున్న నల్లధనాన్ని బంగరంగానో.. వజ్రాలగానో.. డాలర్లుగా మార్చేసుకుంటారని.. ఓవర్ నైట్ చిత్తుకాగితాలు చేసేశాడని.. అలాంటి వ్యక్తి అవసరం దేశానికి ఉందన్నారు. మోడీ నిర్ణయం వెల్లడించిన సమయంలో తన దగ్గర కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసిన కొంత మనీ ఉందని.. ఆయన చెప్పిన మాట విన్న వెంటనే తాను కూడా కంగారు పడ్డానని.. కానీ.. సక్రమంగా.. లెక్కలు చూపించిన మొత్తమైతే బ్యాంకుల్లో వేసుకోవచ్చని చెప్పారని.. అలాంటప్పుడు బాధ పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

దేశం కుళ్లిపోయిందని.. అవినీతితో దేశం చచ్చిపోతోందని.. కాలికి క్యాన్సర్ వస్తే శరీరం మొత్తం పాకకుండా ఉండటానికి కాలిని తీసేస్తారని.. అలా తీసేటప్పడు చాలా నొప్పి ఉంటుందని.. అలానే దేశానికి అవినీతి క్యాన్సర్ పట్టిందని.. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోవాల్సిందేనన్నారు. ఈ బాధను అనుభవించాలన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అదానీలకు.. అంబానీలకు ముందే చెప్పేశాడని ప్రచారం చేస్తున్నారని.. ఒకవేళ నిజంగానే ఆ పని మోడీ చేసి ఉంటే.. ముకేశ్ అంబానీ తన తమ్ముడు అనిల్అంబానీకి చెప్పకుండా ఉంటాడా? అదానీ తన బ్రదర్ కు చెప్పకుండా ఉంటారా? ఇలా తమకు కావాల్సిన సన్నిహితులకు ఏ ఒక్కరికో చెప్పుకుంటా ఉంటారని.. అదే జరిగితే.. 24గంటలు.. మహా అయితే 48 గంటల్లో దేశం మొత్తానికి పాకిపోయి ఉండేదని.. అలాంటి ప్రచారంలో పస లేదని తేల్చేశారు మెగాబ్రదర్.

రద్దుపై ఆందోళన చేయడం కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ.. మమతా..కమ్యూనిస్టు నేతలందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మంచిపని చేసినా విమర్శేనా?అని ప్రశ్నించిన ఆయన.. పాకిస్థాన్ లో మన దేశ కరెన్సీని ముద్రించటం ఏమిటని? ఆ దేశంలో మన కరెన్సీని ముద్రించి.. ఉగ్రవాద కార్యకలాపాలతో మనల్ని ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని.. మన దగ్గర జరిగిన గోకుల్ ఛాట్.. లుంబినీ పార్క్.. ముంబయి ఉగ్రవాద కార్యకలాపాల గురించి అప్పుడే మర్చిపోయారా? అని ప్రశ్నించిన నాగబు.. మన కరెన్సీని ముద్రిస్తూ పాకిస్థాన్ ఆరాచకం చేస్తుంటే.. అలాంటి వారికి చెక్ చెబుతూ మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని.. వీలైతే కాస్త సపోర్ట్ చేద్దామన్నారు. నిజంగా పదవీ కాంక్ష ఉండి.. మరోసారి ప్రధాని కావాలన్న ఆశ ఉండి ఉంటే మోడీ ఇలాంటి నిర్ణయాన్ని కచ్ఛితంగా తీసుకునేవాడు కాదని.. మోడీ లాంటి మగాడు.. దమ్మున్నోడు.. ధైర్యవంతుడు.. సాహసోపేతమైన వ్యక్తి తీసుకున్న అసాధారణ నిర్ణయాన్ని ఎవరికి వారు తమ వంతుగా సపోర్ట్ చేద్దామని.. ఆయన అసాధ్యుడంటూ పొగిడేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *