పాక్ కు ఫ్రాన్స్, బంగ్లాదేశ్ షాక్

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఫ్రాన్స్‌ కూడా పాక్‌కు గట్టి షాకిచ్చింది. ఇప్పటికే కశ్మీర్‌పై చేస్తున్న మొండి వాదనల నేపథ్యంలో దాయాది దేశం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాటల్ని అదుపులో పెట్టుకోమని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం సైతం పాక్‌కు పలు సూచనలు చేసింది.  కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశాన్ని చర్చల ద్వారా భారత్‌-పాక్‌ పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్‌ డ్రియాన్‌ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో మాట్లాడారు. మరో వైపు తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత్‌ వైపే మొగ్గు చూపింది. ఇది భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ‘ఆర్టికల్ 370 రద్దును భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా బంగ్లాదేశ్ పరిగణిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశం ప్రాంతీయ సుస్థిరత, శాంతిని నెలకొల్పుట, అన్ని దేశాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని దానిలో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కశ్మీర్ అంశం గురించి బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు వివరించిన మరుసటి రోజే ఆ దేశం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

 

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *