నవీన భారత్‌తోపాటు సరికొత్త జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను నిర్మిద్దాం

జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల బంగరు భవిష్యత్తు కోసమే 370 అధికరణాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఈ రెండు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 370 అధికరణంతో రాష్ట్రంలో వేర్పాటువాదం, అవినీతి, కుటుంబ పాలన మాత్రమే సాధ్యమైందన్నారు. పైగా రాష్ట్రంలో ఉగ్రవాద వ్యాప్తికి ఈ నిబంధనను పాకిస్థాన్‌ ఉపయోగించుకుందని చెప్పారు. ఈ ఇబ్బందులతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన ఈ ప్రాంతాల్లో సరికొత్త వెలుగులు రావడం ఖాయమన్నారు. ప్రపంచదేశాల నుంచి వచ్చే సినిమా షూటింగ్‌లు, విద్యా, వైద్యకేంద్రాలతో జమ్మూ-కశ్మీర్‌ లద్దాఖ్‌లు కళకళలాడటం ఖాయమని పేర్కొన్నారు. అందుకు స్థానిక ప్రజలతోపాటు, దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. జమ్మూ-కశ్మీర్‌లో చరిత్రాత్మకంగా, భౌగోళికంగా మార్పులు చేపట్టాక తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ అభివృద్ధికి ఒక మార్గసూచీని ఆవిష్కరించారు. ఆకాంక్ష, ఆశావాద సందేశాలతో తన ప్రసంగాన్ని రంగరించారు. ఉపాధి, పెట్టుబడులకు హామీ ఇచ్చారు. త్వరలోనే అక్కడ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వంగానే కొనసాగుతుందన్నారు.

విద్యాహక్కు, బాలికల సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, కార్మిక, దళిత, మైనారిటీల కోసం రూపొందించిన చట్టాలు. ఇవేవీ కశ్మీర్‌లో అమలుకు నోచుకోలేదు. ఇకపై అలా జరగదు. ఇకపై కశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా ఆ చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి.

ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి. జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌ల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలనూ భర్తీ చేస్తాం. ఆర్మీ, పారామిలటరీ దళాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, రోడ్డురవాణా తదితర మౌలిక వసతుల సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తాం.

జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఉత్సాహవంతులైన యువత ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కావాలి. ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు. 1947 తరువాత పాక్‌ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది. ఐటీ, డిజిటల్‌ టెక్నాలజీలతో ఉపాధికి అవకాశాలుంటాయి. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి. క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్ట్స్‌ అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి. చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి.

‘సినిమా షూటింగ్‌లకు కశ్మీర్‌ అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది’ అని భారతీయ సినీ పరిశ్రమను మోదీ కోరారు.జమ్మూ-కశ్మీర్‌ కుంకమ పువ్వు, శాలువాలు, కళాకృతులు, లద్దాఖ్‌లో వనమూలకా ఉత్పత్తులకు ఎంతో పేరుంది. లద్దాఖ్‌లో ‘సోలో’ అనే మొక్క ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారికి సంజీవనిలా పనిచేస్తుంది. తక్కువ ఆక్సిజన్‌లోనూ శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీటితో స్థానికులకు ఆదాయం లభించాలి. ఆ దిశగా ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి’ అని మోదీ ఆకాంక్షించారు.

జమ్మూ-కశ్మీర్‌ భారతదేశానికి మకుటం అని చిన్నప్పటినుంచీ వింటున్నాం. దాన్ని రక్షించుకోవడానికి ఎందరో వీరులు అమరులయ్యారు.ఈ దేశ ప్రజల సామర్థ్యం, ఉత్సాహం ఎంతటి ప్రభావవంతమైనదో చాటుదాం. నవీన భారత్‌తోపాటు సరికొత్త జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను నిర్మిద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *