ఆమెను మన సింధు చితక్కొట్టేసింది

క్రికెట్ కు తప్ప మన దేశంలో ఏ క్రీడకు సరైన ఆదరణ ఉండదన్న మాట తరచూ చెబుతుంటారు. కానీ.. ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో అప్పటివరకూ పరిచయం లేని ఆటల్లో మనోళ్లు పాల్గొంటుంటే.. కళ్లు అప్పగించుకొని మరీ పతకం తెస్తారన్న ఆశతో ఎదురుచూసిన పరిస్థితి. మామూలుగా అయితే.. బ్యాడ్మింటన్ లాంటి క్రీడను లైట్ తీసుకునే భారతీయులు.. ఒలింపిక్స్  చివరకు వస్తున్న పతకం రాని వేళ.. మన తెలుగమ్మాయి సింధు ఫైనల్ కు చేరటంతో స్వర్ణం మీద ఆశలతో భారతావని మొత్తం ఎంతలా భావోద్వేగంతో కదిలిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

కీలకమైన క్రికెట్ మ్యాచ్ ల సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో.. ఒలింపిక్స్ లో మన సింధు ఫైనల్స్ సందర్భంగా అలాంటి ఏర్పాట్లే చేశారు. పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి మరీ.. మ్యాచ్ ఫలితం కోసం కోట్లాది కళ్లు ఎదురుచూశాయి. అయితే.. ఆ మ్యాచ్ లో సింధు.. తన ప్రత్యర్థి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది.

ఆ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సింధు.. తెలివిగా ఆడిన కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ.. స్వర్ణం పోయిన రజతం దక్కటంతో భారతీయులంతా పండగే చేసుకున్నారు. ఎట్టకేలకు మనమ్మాయి రజతం గెలిచిందన్న ఆనందంతో ఫైనల్ ఓటమిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. సింధు మాత్రం ఆ ఓటమిని మర్చిపోయినట్లుగా లేదు. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్ కోసం కరోలినా మారిన్ తో జరిగిన మ్యాచ్ లో తన దూకుడును పక్కన పెట్టేసిన సింధు.. తెలివిగా ఆడి కసిదీరా తన ప్రత్యర్థిని ఓడించింది.

ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి అయిన కరోలినా మారిన్ పై విజయం సాధించటంతో సింధులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. తాజాగా సింధు ఊపు చూస్తుంటే.. టైటిల్ ను తీసుకొచ్చేలా ఉందని చెప్పొచ్చు. అంతిమ పోటీలో ఆమె విజయం సాధించాలని కోరుతూ.. మనమంతా ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *