రాజశేఖర్ ఫ్యామిలీ సంబరాలు చూశారా?

పదేళ్లుగా హిట్టు ముఖం చూడలేదు. కనీసం యావరేజ్ సినిమా కూడా లేదు. అవకాశాలు తగ్గిపోయాయి. మార్కెట్ పడిపోయింది. నటించాలన్న కోరిక ఉన్నా బలవంతంగా సినిమాలు మానుకుని సైలెంటుగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో తనను నమ్మి ఓ యువ దర్శకుడు వచ్చిన మంచి కథ చెప్పడం.. దాన్ని ఓ నిర్మాత రాజీ లేకుండా నిర్మించడం.. ఇప్పుడా సినిమా రిలీజై హిట్ టాక్ అందుకోవడం.. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అందుకే రాజశేఖర్.. ఆయన కుటుంబ సభ్యులు మామూలు సంతోషంలో లేరిప్పుడు ఆ సంతోషమంతా శుక్రవారం రాత్రి రాజశేఖర్ ఇంటి మీద బాల్కనీలో కనిపించింది.

‘గరుడవేగ’కు అన్ని వైపులా పాజిటివ్ టాక్ రావడంతో రాజశేఖర్.. జీవిత.. వీరి ఇద్దరు కూతుళ్లు.. ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఇతర యూనిట్ సభ్యులు.. అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కింద డప్పు వాయిస్తుంటే.. వీళ్లందరూ పైన డ్యాన్సులేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు పూల మాలలు వేసుకుంటూ.. నవ్వుతూ.. స్వీట్లు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. రాజశేఖర్ ఒక దశలో ఆనందం పట్టలేక తీన్ మార్ డ్యాన్స్ కూడా చేయడం విశేషం. రాజశేఖర్.. శ్రద్ధా దాస్.. ఆదిత్.. వీళ్లందరూ ప్రవీణ్ సత్తారుకు పూల మాల వేసి సత్కరించబోతే.. అతనే రివర్సులో వీళ్లకు మాలలు వేశాడు. కాకపోతే రాజశేఖర్ ఫ్యామిలీకి ‘గరుడవేగ’ సక్సెస్ ఆనందాన్నే ఇచ్చినప్పటికీ లోలోన బాధ వారిని వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజుల కిందటే రాజశేఖర్ తల్లి.. ‘గరుడవేగ’ రిలీజ్ కు రెండు రోజుల ముందు జీవిత సోదరుడు చనిపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాయి. ఇవి లేకుంటే వీరి ఆనందం పరిపూర్ణంగా ఉండేదే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *