రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్..రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతిగా..

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. కోవింద్ కు 65.65 శాతం ఓట్లు( 7,02,644 ఓట్లు ) లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ కు 34.35 శాతం ఓట్లు ( 3,67,314 ఓట్లు ) లభించాయి. ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి రౌండు నుంచే రామ్‌నాథ్‌ కోవింద్‌ తన ప్రత్యర్థి మీరా కుమార్ పై అధిక్యంలో కొనసాగారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్ నాయకులు, మమతా బెనర్జీ అభినందించారు.

ఓటమి అనంతరం.. తాను సైద్ధాంతిక పోరాటం సాగించినట్లు మీరా కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ గెలుపు తరువాత కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ సాగింది. తొలుత పార్లమెంట్‌ భవన బ్యాలెట్‌ పెట్టెను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ క్రమంలో రాష్ట్రాల వారీగా బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి లెక్కించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్‌ నమోదైంది. మీరా కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా పోలవలేదు.

కోవింద్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహాత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్‌ వర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 197-79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్‌ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

198-93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్‌ 1986లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగల్‌ ఎయిడ్‌ బ్యూరో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమున్న కోవింద్‌ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదాస్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సన్నిహితునిగా పేరుంది. కోవింద్‌ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు ఘాటంపూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్‌ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్‌ 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు.

ప్రచార ఆర్బాటం తక్కువే..
కోవింద్‌ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏ  చానల్‌లోనూ సరిగా కనిపించలేదు. పార్టీ, రాజ్‌నాథ్‌ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి. ముందునుంచే సౌమ్యుడిగా మితభాషిగా పేరున్న రామ్‌నాథ్‌ మంచి కార్యనిర్వాహకుడిగా పేరుంది.

అయితే, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేక మచ్చను తుడిచిపెట్టేందుకు నాడు అబ్దుల్‌ కలాంను ఎంపిక చేసినట్లుగానే నేడు దళితులపై జరుగుతున్న దాడులు, రాజకీయాల్లో దళితుల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలను ఆకర్షించేందుకే బీజేపీ రామ్‌నాథ్‌ను తెరపైకి తెచ్చిందని, ఈయనను ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా ఆపరేషన్‌ 2019 సాధారణ ఎన్నికలు బీజేపీ ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *