హైదరాబాద్ లో సైనాకు అవమానం

ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నమాట భారత మహిళా బ్యాడ్మింటన్ కు అతికినట్లు సరిపోతుంది. నిన్నటి వరకూ సైనాకు బాకాలు ఊదిన బ్యాడ్మింటన్ సంఘం పెద్దలు, మీడియా ఇప్పుడు సింధుకు గొడుగు పడుతున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్లో రజతంతో వచ్చిన సింధుకు ఘనస్వాగతం పలికి కాంస్యంతో వచ్చిన సైనాను విస్మరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరానికి, భారత బ్యాడ్మింటన్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన చాంపియన్ ప్లేయర్ సైనాపట్ల చూపుతున్న వివక్ష పట్ల ఆమె కుటుంబసభ్యులు విస్మయం చెందుతున్నారు.

భారత మహిళా బ్యాడ్మింటన్ కు సైనా, సింధు రెండు కళ్లు. ఇద్దరూ గొప్పగొప్ప విజయాలతో భారత బ్యాడ్మింటన్ ఘనతను ఎవరెస్టు ఎత్తుకు తీసుకువెళ్లినవారే. అయితే భారత బ్యాడ్మింటన్లో ప్రస్తుత పరిస్థితి ప్రధానంగా హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం కొత్తొక వింత, పాతొక రోత అన్నట్లుగా తయారయ్యింది. గ్లాస్గోలో ఇటీవలే ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్లు వీపీ సింధు, సైనా నెహ్వాల్ ఇద్దరూ పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. సైనా సెమీస్ లో ఓడితే సింధు ఫైనల్లో పరాజయం చవిచూసింది. సింధు రజత విజేతగా, సైనా కాంస్య విజేతగా హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు.

సింధుకు స్వాగతం పలకడంలో పోటీపడిన బ్యాడ్మింటన్ సంఘం, మీడియా సైనా విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత బ్యాడ్మింటన్ కు, హైదరాబాద్ నగరానికి సైనా సాధించిపెట్టిన ఘనత, గుర్తింపును మరచిపోయి నిర్లిప్తంగా వ్యవహరించడాన్ని చివరకు సైనా తండ్రి హర్ వీర్ సింగ్ సైతం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆవేదనను హెచ్ఏంటీవీ తో పంచుకొన్నారు. దేశానికి పతకాలు సాధించిన అందరినీ సమానంగా చూడాలన్న ఆవేదన హర్ వీర్ సింగ్ మాటల్లో వ్యక్తమయ్యింది. 2015 ప్రపంచ బ్యాడ్మింటన్లో సైనా రజత పతకం సాధించిన సమయంలో హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం కానీ, మీడియా కానీ ఏమాత్రం పట్టించుకోలేదని ఇప్పుడు మాత్రం నానాహడావిడీ చేస్తున్నారని క్రీడావిశ్లేషకులు సైతం అంటున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్లో సైనా సాధించిన అపూర్వ విజయాలు, అరుదైన రికార్డులు, అసాధారణ ఘనత సింధు విజయాల జోరుతో మరుగున పడిపోతోందన్నది కాదనలేని నిజం. భారత మహిళా బ్యాడ్మింటన్ చరిత్రను తిరగేస్తే అమీ ఘియా, పీవీవీ లక్ష్మి, అపర్ణా పోపట్ లాంటి ఎందరో గొప్పగొప్ప ప్లేయర్లు మనకు కనిపిస్తారు. అయితే వారెవ్వరూ సాధించలేని ఘనతను 18 ఏళ్ల వయసులోనే సైనా నెహ్వాల్ సాధించింది. ఆరేళ్ల వయసు నుంచే హైదరాబాద్ లో నానీ ప్రసాద్, మహ్మద్ అరీఫ్ లాంటి శిక్షకుల వద్ద బ్యాడ్మింటన్ ఓనమాలు దిద్దుకొన్న సైనా అంచెలంచెలుగా ఎదిగి గోపీచంద్ పర్యవేక్షణలో 2015 సీజన్ నాటికి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ స్థాయికి ఎదిగింది.

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ అంటే కేవలం చైనా మాత్రమే. వాంగ్ ఈ హాన్, లీ ఝరీ, వాంగ్ జిన్, జియాంగ్ వాన్ ఇలా మొదటి నాలుగుర్యాంకుల్లోనూ చైనా ప్లేయర్లే ఉంటూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించేవారు. అయితే మహిళా బ్యాడ్మింటన్లో చైనా ప్లేయర్లను ఒక్కొక్కరినే ఓడిస్తూ చైనా వాల్ ను బద్దలుకొట్టిన ఘనత కేవలం సైనాకు మాత్రమే దక్కుతుంది.

ఒలింపిక్స్ లో పతకం సాధించినా ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల ఫైనల్స్ చేరినా రజత పతకాలు సాధించినా అది సైనా తర్వాతే ఎవరైనా. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా కాంస్య పతకం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలిమహిళగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు సైనా కెరియర్ లో 2015 సీజన్ అత్యుత్తమంగా నిలిచిపోతుంది. టాప్ ర్యాంక్ ప్లేయర్ గా ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ బ్యాడ్మింటన్ రెండు టోర్నీల ఫైనల్స్ చేరిన సైనా టైటిల్ సమరంలో స్పెయిన్ ప్లేయర్ కారోలినా మారిన్ చేతిలో ఓటమి పొందాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో రజతం, ప్రపంచ బ్యాడ్మింటన్లో సిల్వర్ సాధించిన భారత తొలి మహిళా ప్లేయర్ గా సైనా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2006 కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్యం నెగ్గిన సైనా 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం అందుకొంది.

ఇక జాతీయస్థాయిలో 12సార్లు సీనియర్ ,జూనియర్ స్థాయిల్లో నేషనల్ చాంపియన్ గా నిలిచిన సైనా అందుకొన్న టైటిల్స్ లో మూడు సూపర్ సిరీస్ ప్రీమియర్, ఏడు సూపర్ సిరీస్, ఎనిమిది గ్రాండ్ ప్రీ గోల్డ్, ఒక గ్రాండ్ ప్రీ ఉన్నాయి. 18 ఏళ్ల వయసు నుంచే భారత బ్యాడ్మింటన్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సైనా 27 ఏళ్ల లేటు వయసులోనూ ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో తన స్థానాన్ని కాపాడుకొంటూ వస్తోంది. కెరియర్ చివరిదశకు చేరిన సైనా నిరూపించుకోవాల్సింది ఇక ఏదీ లేదన్నా అది అతిశయోక్తికాదు.  సైనా లాంటి అసమాన క్రీడాకారిణిని తగినవిధంగా గౌరవించకపోయినా అవమానించకుండా ఉంటే అదే పదివేలు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *