మిథాలీ కెప్టెన్సీనే అవమానిస్తావా..?

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో భారత్ ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం ముగిసిన సెమీస్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (171 నాటౌట్: 115 బంతుల్లో 20×4, 7×6) అజేయ శతకం బాదడంతో వర్షం కారణంగా కుదించిన 42 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్లు విల్లని (75: 58 బంతుల్లో 13×4), బ్లాక్‌వెల్ (90: 56 బంతుల్లో 10×4, 3×6) మెరుపులు మెరిపించడంతో భారత్‌ శిబిరంలో కంగారు మొదలైంది. ఈ సమయంలో భారత్ కెప్టెన్ మిథాలీ రాజ్.. ఫీల్డర్లని ఎక్కువగా బ్యాటర్‌కి సమీపంలో ఉంచుతూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.

ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సంజయ్ మంజ్రేకర్.. మిథాలీ రాజ్ కెప్టెన్సీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్‌లు చేశాడు. ‘మిథాలీ రాజ్ కెప్టెన్సీనే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది. ప్రస్తుతం చాలా ఆత్మరక్షణ ధోరణిలో ఫీల్డింగ్ మొహరింపు ఉంది. ఎక్కువ మంది సర్కిల్‌ లోపలే ఉంటూ.. బౌండరీలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశాడు.ఈ మ్యాచ్‌‌లో 37వ ఓవర్‌ కొనసాగుతుండగా.. ఇంకా 13 ఓవర్లే మిగిలి ఉన్నాయని.. తర్వాత కొద్దిసేపటికే 12 ఓవర్లే ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇక్కడ మ్యాచ్‌ని 42 ఓవర్లకే కుదించిన విషయాన్ని మంజ్రేకర్ మరిచిపోవడండో అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై దుమ్మెత్తిపోశారు. ‘సెమీ ఫైనల్లో ఎన్నిసార్లు భారత్ జట్టుకి నువ్వు కెప్టెన్‌గా పనిచేశావు’ అని ఒకరు మండిపడగా..‘నీ కంటే మిథాలీ రాజ్‌కే కెప్టెన్‌గా ఎక్కువగా అనుభవం ఉంది’ అంటూ మరొకరు గుర్తు చేశారు. ‘మ్యాచ్‌‌లో అమ్మాయిలు చాలా బాగా ఆడుతున్నారు. నీ సలహా ఏమీ అవసరం లేదు. నువ్వు ఆడిన రోజులతో పోలిస్తే.. వీళ్లే అత్యుత్తమం. మాజీ క్రికెటర్‌గా నీకున్న గౌరవం కాపాడుకో’ అంటూ మరొకరు హితవు పలికారు. ఇంగ్లాండ్‌తో ఆదివారం ఫైనల్లో భారత్ జట్టు లార్డ్స్‌ వేదికగా ఢీకొననుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *